Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్ అవుట్లెట్లు
- తొలిదశలో ఐదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలు
- విద్యుదుత్పత్తి కేంద్రాలన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్న ఏపీ
- అభ్యంతరం తెలిపిన తెలంగాణ, న్యాయ సలహా తర్వాత నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ గురువారం నుంచి అమలులోకి రానున్నది. పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అభ్యంతరం తెలిపినా..ఆయా బోర్డుల సబ్ కమిటీలు పలు దఫాలుగా ఇరు రాష్ట్రాల సర్కారులతో చర్చలు జరిపి అక్టోబర్ 14 నుంచే అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు మొత్తం ఐదు ప్రాజెక్టుల్లో 29 కేంద్రాలు అక్టోబర్ 14 నుంచి బోర్డు ఆధీనంలోకి వెళ్లనున్నాయి. అంటే, గెజిట్ నోటిఫికేషన్ రెండో షెడ్యూల్లోని అన్ని డైరెక్ట్ అవుట్లెట్లు బోర్డు పరిధిలోకి వస్తాయి. మిగిలిన వాటిపై కేంద్ర జల్‌శక్తి శాఖ త్వరలో నిర్ణయం తీసుకో నుంది. 29 కేంద్రాలకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై కృష్ణా బోర్డు ఉపసంఘం రూపొందించిన ముసాయిదా ప్రకారమే బోర్డు నిర్ణయం తీసుకుంది. కృష్ణా బోర్డు సబ్ కమిటీ ముసాయిదాపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ప్రతినిధి బృందంతో మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజ మాన్య బోర్డు సమావేశమైంది. బోర్డు చైర్మెన్ ఏఎమ్‌పీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్, ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్యామల రావు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు పాల్గొ న్నారు. కృష్ణా ప్రాజెక్టులపై నిర్మించిన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని బోర్డు సానుకూలంగా స్పం దించింది. ఆమేరకు కృష్ణా బోర్డు తీర్మానం కూడా చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తేవాలన్న ఏపీ విజ్ఞప్తిని అంగీకరించలేదు : రజత్‌కుమార్
బోర్డు సమావేశం అనంతరం తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మాట్లా డుతూ.. 65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నా యన్నారు. నాగార్జున సాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించిందని చెప్పా రు. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చాక రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సమవాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని బోర్డును కోరామన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకు రావాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని తాము అంగీకరిం చలేదని తెలిపారు. మన రాష్ట్రంలో ఎక్కువ శాతం వ్యవసాయం బోరుబావులు, ఎత్తిపోతలపైనే ఆధారడి ఉందనీ, జల విద్యుత్ ఉత్పత్తి చాలా అవసరమని బోర్డు దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఈ విషయంలో న్యాయసలహా కోరామనీ, ఆమేరకు ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
పెద్దవాగు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోకపోతే అంగీకరించం : శ్యామలరావు
తెలంగాణ ప్రభుత్వం సాగునీటి అవసరాలు లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నదన్న దానిపై కేంద్రానికి ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేయడం వల్లనే గెజిట్ వచ్చిందనీ, ఇప్పుడు బోర్డు పరిధిలోకి వాటిని తీసుకోకపోతే తమకు అంగీకారం కాదని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించిన అన్ని కేంద్రాలనూ బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ కేఆర్ఎంబీ తీర్మానం చేయగా..తాము ఆమోదం తెలిపామన్నారు. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చాకే ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందా? లేదా ? అనేది తమకు తెలియదనీ, ఆ విషయాలను బోర్డే చూసుకోవాలని అన్నారు. అభ్యంతరాలు, సమస్యల పరిష్కారం కోసం రెండు, మూడు నెలలు సంధికాలం ఉంటుందని తెలిపారు.
శ్రీశైలం నుంచి బోర్డు పరిధిలోకి వెళ్లే కేంద్రాలు
శ్రీశైలం స్పిల్‌వే, కుడి విద్యుత్ కేంద్రం, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ఎత్తిపోతలకు నీటిని తరలించే పంపుహౌస్, ముచ్చుమర్రి పంపుహౌస్, శ్రీశైలం ఎడమ విద్యుత్తు కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపుహౌస్
నాగార్జునసాగర్ కింద..
సాగర్ హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువలతో పాటు ప్రధాన విద్యుత్ హౌస్, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఎ.ఎం.ఆర్.పి), నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ కింద హెడ్‌వర్క్స్, విద్యుత్ బ్లాక్
ఇతర ప్రాజెక్టుల కింద..
పులిచింతల కింద హెడ్‌వర్క్స్, విద్యుత్ బ్లాక్,
కెసి కాలువ కింద సుంకేశుల
ఆర్డీఎస్ కింద క్రాస్ రెగ్యులేటర్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం.