Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 నెలలుగా పెండింగ్
- వర్కింగ్ ఏజెన్సీల గగ్గోలు
- ఇంజినీరింగ్ శాఖకు తల'బొప్పి'
- ప్రశంసలే తప్ప పైసలివ్వని కేంద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి కావచ్చినా ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. వర్కింగ్ ఏజెన్సీ(కాంట్రాక్లర్లు)ల నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌శాఖ ఒత్తిడిని ఎదుర్కొంటు న్నది. దాదాపు 11 నెలలుగా వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతు న్నారు. సుమారు రూ.2 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం సర్కారు దగ్గర కాసులు లేకపోవడమే. ఫ్లాగ్షిప్ పథకంగా చేపట్టిన భగీరథను బ్యాంకు రుణాలతోనే నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు 16 బ్యాంకులతో కూడిన కన్సార్టియం భగీరథ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చింది. అలాగే నా బార్డు సైతం అప్పులు ఇచ్చింది. రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన విషయం విది తమే. ఈ రుణాల కోసం టీఆర్ఎస్ సర్కారు తెలం గాణ డ్రింకింగ్ వాటర్ సప్లరు కార్పొరేషన్ లిమిటెడ్ (టీడీడబ్ల్యూఎస్సీఎల్)ను ఏర్పాటు చేసింది. కాగా ప్రభుత్వం కేవలం మార్జిన్ మనీ మాత్రమే సమకూర్చి భగీరథ పనులు చేపట్టింది. 2017 డిసెంబరు నాటి కే పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు పనులు 2019 చివర దాకా జరిగాయి. దీనికి కారణమూ నిధుల కొరతనే. ఇదిలావుండగా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేస్తే మంచి ఫలితాల ఉంటాయని నిటిఅయోగ్ కేంద్రానికి ప్రత్యేకంగా నివేదిక ఇచ్చినా, చడీచప్పుడూ లేదు. ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీటిని అందిస్తామనీ ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. కేంద్రం పథకం 'హర్‌ఘర్ జల్' లక్ష్యాలకు భగీరథ ప్రాజెక్టు దగ్గరగా ఉందని కేంద్ర జల్‌శక్తి శాఖ చెప్పింది కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు లేఖలు రాశారు. ఢిల్లీకి వెళ్లి వినతిపత్రాలు ఇచ్చారు. రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం ప్రయత్నం చేశారు. 'భగీరథ ప్రాజెక్టుకు ప్రశంసలే తప్ప నిధులు ఇవ్వడం లేదని' బహిరంగంగా వ్యాఖ్యానించారు. అయినా మోడీ సర్కారు నుంచి స్పందన లేదు. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నదని ఆయా సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. సర్కారు బడ్జెట్లో బారీస్థాయిలోనే కేటాయింపులు చేస్తున్నా, ఖర్చు చేయడంలో వెనుకపడుతున్నది. దాదాపు సంవత్సరం కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. మిషన్ భగీరథ రాష్ట్ర కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి. ఇంజినీరింగ్ శాఖ అధికారులను అవకాశం ఉన్నప్పుల్లా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవైపు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకపోగా, మరోవైపు అధికారులను కలిసినా ప్రయోజనం లేక వర్కింగ్ ఏజెన్సీలు (కాంట్రాక్టర్లు) సతమతమవుతున్నాయి. ఇదిలావుం డగా మిషన్ భగీరథ పథకం దేశంలోనే అత్యంత గొప్పదని కితాబు ఇస్తున్న కేంద్రం, ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి మాత్రం చేతులు రావడం లేదు. ససేమిరా అంటున్నది. రూ. 17 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని నిటిఅయోగ్ సిఫా రసు చేసినా రాజకీయ కారణాలతో మోడీ సర్కారు కిమ్మనడం లేదు. అసలు పట్టించుకోవడం లేదు. దీంతో ఇటు సర్కారు, అటు కాంట్రాక్టర్ల పరిస్థితి అడకత్తెరలో పొకచెక్కలా తయారైంది. తొలుత ఈ ప్రాజెక్టును రూ. 45 వేల కోట్లతో పూర్తిచేస్తామని డీపీఆర్‌లో చెప్పారు. కాగా ఇప్పటివరకు రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.3 వేల కోట్లు అవసరమవుతాయని భగీరథ ఇంజినిరింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ఇబ్బందులున్నా రూ. 36 వేల కోట్లల్లోనే భారీ తాగునీటి ప్రాజెక్టు పూర్తవుతుండటం గమనార్హం.