Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం తిప్పలు
- గడువు తీరుతున్నా అందని పత్రాలు
- ప్రభుత్వ విభాగంలోనూ సిబ్బంది కొరత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనిషి రోగాల బారిన పడటమే బాధాకరం. ఆ రోగానికి చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రుల్లో తగిన వసతులు లేక ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన వారు ఆ డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితి. ఇక బీమా సౌకర్యం ఉన్న కొద్ది మంది తాము ముందు అప్పు చేసిన తర్వాత రీయింబర్స్మెంట్ లేదా బీమా వస్తుందనే ధీమాతో ఆ ఆస్పత్రుల్లో చేరతారు. ఆ కొద్ది మందితోనే కార్పొరేట్ దవాఖానాలు వందల కోట్ల రూపాయలను వెనుకేసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో ఒక్కో రోగి నుంచి కనీసం రెండు లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఆయా ఆస్పత్రులు వసూలు చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు కరోనా దెబ్బతో వేలాది మంది ప్రయివేటుకు పరుగులు తీశాయి. కరోనాకు సమాంతరంగా ఇతర రోగాలతోనూ చేరిన వారి సంఖ్య కూడా భారీగానే ఉన్నది. అయితే వీరికి అవసరమైన పత్రాలను సకాలంలో ఇవ్వకుండా ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు చికిత్స పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం నిర్దేశిత సమయంలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారికింకా అసరమైన పత్రాలు సకాలంలో అందటం లేదు.
చికిత్స పొందిన తర్వాత రెఫరల్, జన్యూనిటీ, ఎసెన్షియల్ తదితర సర్టిఫికేట్లను రీయింబర్స్మెంట్ కోసం సమర్పించాల్సి ఉంటుంది. అయితే వీటిని డిశ్చార్జి సమయంలో ఇవ్వకుండా తర్వాత తీసుకోవాలని కోరటంలో రోగులు ఇంటికి వెళ్లాక ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మంది సిబ్బందితో కార్పొరేట్ ఆస్పత్రులు ఇన్సూరెన్స్ విభాగాలను నడిపిస్తుండటంతో రోజుల తరబడి తిరిగినా పత్రాలు చేతికందటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో తన భర్తకు మూత్రపిండాల శస్త్రచికిత్స చేయించిన ఒక ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ గత రెండు నెలలకుపైగా ఆస్పత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే ప్రతి రోజూ ఏదో ఒక సాకు చెప్పి ఆమెను వెనక్కి పంపిస్తున్నారని వాపోయారు. ఒక రోజు సంబంధిత డాక్టరు లేడనీ, మరో రోజు ఇన్సూరెన్స్ విభాగం వారు సెలవు పెట్టారంటూ కొర్రీలు పెడుతుండటంతో పలువురు రోగుల బంధువులు ఆస్పత్రుల చుట్టూ తిరగక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ప్రయివేటు బీమా కంపెనీలు కుంటిసాకులతో బీమాను చెల్లించేందుకు నిరాకరిస్తుండగా, మరోవైపు ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు కూడా సరైన రీతిలో కార్పొరేట్ ఆస్పత్రులు సహకరించకపోవటం గమనార్హం.
మెడికల్ రీయింబర్స్మెంట్ విభాగంలో సిబ్బంది కొరత
కరోనా కాలంలో చాలా విభాగాలకు పని లేకుండా పోయింది. అయితే కొన్ని విభాగాల్లో పని భారం పెరిగింది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వైద్య, నర్సింగ్ సిబ్బంది కరోనా కాలంలో నిరంతరాయంగా పని చేసినా వారి సేవలు సరిపోలేదు. వారు వైరస్‌తో పోరాడి వారియర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం ఆ శాఖకు మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య సాధారణ రోజుల కన్నా విపరీతంగా పెరిగింది. అందుకు తగినట్టు సిబ్బందిని మాత్రం పెంచలేదు. దీంతో అంతకు ముందు మాదిరిగానే ఆ విభాగాధిపతితో పాటు పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక వైపు రోగాల బారిన పడి, అప్పులపాలై ఆస్పత్రులకు డబ్బులు చెల్లించి, సకాలంలో రీయింబర్స్మెంట్ డబ్బులు రాక బాధితులు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనికి తగ్గట్టు సిబ్బంది పెంచేందుకు చర్యలు తీసుకోవటంతో పాటు రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని మెడికల్ రీయింబర్స్మెంట్ విభాగంలోనూ పెరిగిన పనికి తగినట్టు సిబ్బంది, సౌకర్యాలను పెంచాలని పలువురు కోరుతున్నారు.