Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని 11 నెలలుగా రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే మోడీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా రైతులపై దాడులు, హత్యలు చేయడం దుర్మార్గమైన చర్య అని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మృతి చెందిన రైతులకు కొవ్వుత్తులతో ఆల్ ఇండియా కిసాన్ సంఘ్ స్ట్రగుల్ కోఆర్టినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ), ప్రజా సంఘాలు నివాళి అర్పించాయి. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు సాగర్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం రైతు వ్యతిరేక నిరంకుశ వైఖరికి లఖింపూర్‌లో నలుగురు రైతులను హత్యలు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. దీనికి కారణమైన కేంద్ర హోం సహాయక మంత్రి అజయ్ మిశ్రాను కేంద్రప్రభుత్వం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పీవోడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ హత్యాకాండకు బాధితులైన కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేయకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్దం అన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 15వ తేదీన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం, 18న దేశవ్యాప్తంగా రైల్‌రోకో నిర్వహించనున్నట్టు తెలిపారు. 26న ఉత్తరప్రదేశ్ రాజధానిలో లఖింపూర్ ఘటన నేపథ్యంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పశ్య పద్మ. వేములపల్లి వెంకట్రామయ్య, ఝాన్సీ, అనురాధ, మైస శ్రీనివాస్, ఎం పరుశరాం, రణధీర్, తదితరులు పాల్గొన్నారు.
క్యాబినెట్లో కొనసాగించడం సిగ్గుచేటు :చాడ
రైతులను కారుతో తొక్కి చంపిన లఖీంపూర్ ఘటనలో తన కుమారుడికి ఎలాంటి ప్రమేయం లేదంటూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అబద్దాలు చెప్పినా... ఇంకా ఆయన్ను క్యాబినెట్లో కొనసాగించడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.