Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత, ప్రాంతీయ వాదాల ప్రాతిపదికన...
- వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే..
-విద్యుత్ రెగ్యులేటర్‌ని వెనక్కి తీసుకోవాలి
- ప్రతి దళితుడికీ దళితబంధు అమలు చేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రతినిధి
మత, ప్రాంతీయ వాదాల ప్రాతిపదికన మోడీ, కేసీఆర్ పాలన సాగిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిందేనని అన్నారు. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరోవ మహాసభ ఉద్యమ కేంద్రమైన ఆరుట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందన్నారు. రాష్ట్రంలో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందనీ, కానీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం నిల్వల పేరుతో కేవలం 60 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మిగిలిన ధాన్యాన్ని రైతులు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్ ధరల్లో ట్యాక్సుల రూపంలో రూ.30 రాష్ట్రం వసూలు చేస్తే, కేంద్రం రూ.45 వసూలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ రెగ్యులేటర్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పది నెలలుగా రైతులు పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల మరణాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు ఉద్యమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అమలు చేయాలన్నారు. దళిత బంధు మాదిరిగా 111 కులాలకు కూడా బంధు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలన్నారు. దళితబంధుతోపాటు మూడెకరాల భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంత పోరాటం నిర్వహించేందుకు సీపీఐ(ఎం) ముందుంటుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి దుబ్బాక రామ్‌చందర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యాదయ్య, మండల కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు బుగ్గ రాములు, గోప్షాల్, గ్రామ కార్యదర్శి రవి, గ్రామ వార్డు సభ్యులు, మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.