Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోథ్/ఆలేరురూరల్
పంట సాగుకు తెచ్చిన అప్పులు పెరిగి గుదిబండగా మారడం.. పంటలు సరైన దిగుబడి రాకపోవడంతో ఒత్తిడికి గురైన అన్నదాతలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన రైతు భీమా ఉపేందర్(28) తన మూడెకరాల భూమిలో పత్తి, కంది సాగు చేశాడు. అయితే, పైర్లు సరిగా లేకపోవడంతో పంట దిగుబడి రాదోమోనని కలత చెందాడు. సాగు కోసం బ్యాంక్‌లో రూ.లక్ష, ప్రయివేట్‌గా రూ.2లక్షలు అప్పు చేశాడు. వడ్డీలు పెరుగుతున్నాయి. దాంతో మనస్తాపం చెందిన ఉపేందర్ మంగళవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ్నుండి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. బుధవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మొటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన రైతు మాటూరి పరుశరాములు(32) రెండున్నర ఎకరాల్లో పత్తి, ఎకరన్నర పొలంలో వరి సాగు చేశాడు. దీనికిగాను సుమారు రూ.3 లక్షల వరకు అప్పు అయింది. కాలం కలిసి రాక పంట సరిగా పండలేదు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేక పోయాడు. అప్పుల వారి ఒత్తిడి తాళలేక వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు.