Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటమునిగి వ్యక్తి మృతి
- వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రాణం పోయిందన్న
- మృతుని కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-పుల్కల్
బతుకమ్మ నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండల కేంద్రంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మలో ఆడపడుచులు ఎంతో కోలాహాలంగా ఆడారు. అనంతరం నిమజ్జనం చేయడం కోసం సాయంత్రానికి స్థానిక చిట్టెం చెరువుకు తీసుకువచ్చారు. అయితే పుల్కల్కు చెందిన చాకలి రమేష్(28) బతుకమ్మను నిమజ్జనం చేయడానికి చెరువులోకి దిగి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు బయటికి తీశారు. కొన ఊపిరితో ఉన్న రమేష్‌ను గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది ఒక్కరూ అందుబాటులో లేకపోవడంతో చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించారు. ఆ వాహనం రావడం ఆలస్యం కావడంతో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా మృతునికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లనే రమేష్ ప్రాణం పోయిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఏ ఒక్క వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహించారు. సంబంధిత సిబ్బందిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరారు. లేని యెడల ఆరోగ్య కేంద్రం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.