Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ లీడర్ ఇన్ ద కంట్రీ
- కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ బృందం ప్రశంసలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పట్టణ ప్రాంత అడవుల నిర్వహణ, సమీప నివాస ప్రాంతాలకు పర్యావరణ సమతుల్యత అందేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలాబాగున్నాయంటూ కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ ప్రతినిధుల బృందం ప్రశంసిం చింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిలో తెలం గాణ దేశానికి నాయకత్వం (లీడర్ ఇన్ ద కంట్రీ) వహిస్తుందనటంలో సందేహం లేదని కొని యాడింది. రాష్ట్రంలో రక్షిత అటవీ ప్రాంతాలు, వాటి రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, కర్ణాటక మాజీ పీసీసీఎఫ్ కే.సింగ్ నేతృత్వంలో డాక్టర్ పీకే మాథూర్, డాక్టర్ పీఎస్. ఈసా, డాక్టర్ సీ. రమేశ్ బృందం సంగారెడ్డి జిల్లా మంజీరా, మహబూబాబాద్ జిల్లా పాకాల అభయారణ్యంతో పాటు హైదరాబాద్ శివారులోని మహావీర్ హరిణి వనస్థలి, మరికొన్ని అటవీ ప్రాంతాల్లో పర్యటించింది. బుధవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లోఅటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభతో పాటు, ఇతర ఉన్నతాధికారులతో బృందం సమావేశమైంది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి అద్భుతంగా ఉందనీ, రానున్న రోజుల్లో ఇవి చక్కని పర్యావరణ కేంద్రాలుగా మారుతాయని బృంద సభ్యులు మెచ్చుకున్నారు. క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది ఉత్సాహంతో పనిచేస్తున్నందు వల్ల ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని కొనియాడుతూనే కొన్ని సూచనలు చేశారు. వాటికి సమీపంలో నివసించే వారిలో పర్యావరణంపై అవగాహన కల్పిం చాలనీ, అడవుల రక్షణలో భాగస్వామ్యం చేయాలని కోరారు. మంజీరాలో పక్షుల ఆవాసాలు ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉందనీ, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చుట్టూ విపరీతంగా పట్టణీకరణ జరిగినా హైదరాబాద్ హరిణి వనస్థలి నిర్వహణ చాలా బాగుందనీ, గడ్డి మైదానాలను ఎక్కువగా పెంచాలని సూచించారు. అలాగే జంతువులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా అన్ని అటవీ బ్లాకులను కలుపుతూ ఎకోబ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. పాకాలలో మరిన్ని బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి, మొబైల్ పార్టీల పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. అభయారణ్యాల్లో జంతువులు, చెట్ల రకాల డేటా బేస్ ను తయారు చేయాలనీ, భవిష్యత్ అధ్యయనాలకు ఇవి పనికొస్తాయని సూచించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (అడ్మిన్, విజిలెన్స్) స్వర్గం శ్రీనివాస్, అడిషనల్ పీసీసీఎఫ్‌లు సిద్దానందు కుక్రేటీ, ఎస్కే. సిన్హా, ఎంజె. అక్బర్, ఓఎస్డీ శంకరన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.