Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మండలం జి.చెన్నారం గ్రామపంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఉప్పునూతల వెంకన్నయాదవ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు ఇరుకుగా ఉన్నాయని టీిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చి ఏడేండ్లవుతున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. మూడేండ్ల కింద పేదవారి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అనేకమార్లు తహసీల్దారు, కలెక్టర్లకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారనీ, వాటిని వెంటనే విచారణ చేసి అర్హుల జాబితా ప్రకటించాలని కోరారు. స్థలం ఉన్న పేదవారి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థలంలేని వారికి 120 గజాల ఇంటి స్థలం కొని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. చెన్నారం గ్రామంలో ఉపాధిహామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ అధ్యక్షులు మేడ అంజయ్య, సభ్యులు సైదమ్మ, లింగమ్మ ,రజిత, కవిత లింగయ్య, వెంకన్న పాల్గొన్నారు.