Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు పొన్నాల ప్రశ్న
- తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ నీటి వనరులపై కేంద్రం పెత్తన మేంటని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రం పరిధిలో ఉన్న నీటి వ్యవహారాలపై కేేంద్ర ప్రభుత్వం అజమాయిషీ చేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే కేంద్రం పెత్తనం చేస్తున్నదని ఆరోపించారు. నీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, సీఎం కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేసినట్టేనన్నారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు మహేష్ కుమార్‌గౌడ్, మెట్టు సాయి కుమార్, కైలాష్ కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి జలయజ్ఞం ద్వారా 86 ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ ప్రారంభించిందని గుర్తు చేశారు. కేసీఆర్ కొత్త తెలంగాణకు వెలగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టారనీ, ఏం లాభం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ఒంటెద్దు పోకడలు రాష్ట్రానికి తీవ్రనష్టం కలిగిస్తున్నాయని చెప్పారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఆయన కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 14న తెలంగాణకు బ్లాక్‌డే గా నిలిచిపోతుందని చెప్పారు. కేఆర్ఎంబీ పాపం కేసీఆర్‌దేనన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదని విమర్శించారు.
19న రాజీవ్ సద్భావన సభ : జి నిరంజన్ వెల్లడి
ఈనెల 19న చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన సభను నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ చెప్పారు. ఈసారి 'రాజీవ్ సద్భావన అవార్డు' ను ఏఐసీసీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం వీరప్పమొయిలీకి ఇవ్వనున్నట్టు చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.అంతకు ముందు ఆ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, జాతీయకార్యదర్శి బోసురాజు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితోపాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారని వివరించారు.
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు : రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో అత్యంత వైభవంగా, సంప్రదాయ బద్దంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పర్వదినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉన్న బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బతుకమ్మ బందీ అయిందని సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి పేర్కొన్నారు. సామాజిక బతుకమ్మను దొరల బతుకమ్మగా చేసి ప్రజలకు దూరం చేస్తున్నారని విమర్శించారు.