Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూరిబస్సును ప్రారంభించిన ఎంఈఐఎల్ గ్రూప్ కంపెనీ
- పూణే, ముంబరుల మధ్య బస్సులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను పూణే, ముంబరుల మధ్య బుధవారం నాడు లాంఛనంగా ప్రారంభించింది. కాలుష్య రహిత, శబ్ద రహిత, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణాలు చేయడానికి అవకాశ కలగనుంది. దసరా నుంచి ప్రతిరోజూ రెండు నగరాల మధ్య ఈ బస్సులను నడపనున్నారు . కేంద్ర ప్రభుత్వం, ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాలతో దేశీయ ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచుతున్న సంగతి తెలిసిందే.కొత్తగా ప్రారంభించిన పూరీ బస్సు సేవలను వివరిస్తూ ఈవీ ట్రాన్స్ జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ రైజాడ మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా ఇంటర్సిటి బస్ సర్వీసులను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే వివిధ నగరాల్లో ఎలక్ట్రిక్ ఇంట్రా సిటి బస్సులను నిర్వహిస్తున్న ఈవీ ట్రాన్స్, ఇప్పుడు నగరాల మధ్య ఇంటర్ నగర రూట్లలో బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సుల్లేని లోటును తీర్చినట్టయిందని చెప్పారు. పూరి బస్ ఒక సారి ఛార్జింగ్ చేస్తే, 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చనీ, దీంతో ఇంటర్సిటి సర్వీసులను ప్రారంభించాలనుకునే ఆపరేటర్లకు ఈ బస్సు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నదని వివరించారు.
12 మీటర్ల పూరి బస్సు
కాలుష్య రహిత, ఎలక్ట్రిక్ ఇంటర్సిటి కోచ్ బస్సులో 45 మంది ప్రయాణీకులతో పాటు, డ్రైవర్, కో డ్రైవర్ కూర్చోవచ్చు. ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణించడానికి వీలుగా పుష్ బ్యాక్ సీటుతో అందంగ డిజైన్ చేశారు. ఇందులో ఆధునిక టీవీ, ఇన్ఫోటెయిన్మెంట, వైఫై తో పాటు ప్రతి సీటుకూ ఇన్‌బిల్ట్ యుఎస్బీ ఛార్జర్‌ను అమర్చారు. లగేజి కోసం 5 క్యూబిక్ మీటర్ల సువిశాల స్పేస్‌ను సైతం ఏర్పాటు చేశారు. డీజిల్ బస్సుతో పోల్చితే, పూరి ఎలక్ట్రిక్ బస్సును నిర్వహించడానికి అత్యంత తక్కువ వ్యయం కావడం వల్లే ఇంటర్ సిటి బస్ ఆపరేటర్లకు ఆర్థికంగా చాలా ఆదా అవుతుందని కంపెనీ తెలియజేసింది. ఈ బస్సును లీ ఐయాన్ ఫాస్సేట్ బ్యాటరీ అమర్చడం ద్వారా, ఒక సారి ఛార్జ్ చేస్తే ట్రాఫిక్, ప్యాసింజర్ లోడ్లను బట్టి 350 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ దేశీయంగా తయారు చేస్తున్నది.ఈ బస్సులో అనేక భద్రత పరికరాలను కూడా అమర్చారు. యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం ఎఫ్డీఎస్ఎస్ సిస్టమ్‌ను టీయువీ సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఏడీఏఎస్ సిస్టమ్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), భారతీయ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఐటీఎస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి ఆపత్కాలాన్నైనా ఎదర్కునేందుకు ప్యానిక్ అలారమ్ సిస్టమ్, ప్రమాద సమాయాల్లో ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టమ్ సైతం అందుబాటులో ఉంది. ఈవీ ట్రాన్స్ పూణే, సూరత్, సిల్వాస, గోవా, డెహ్రాడూన్, హైదరాబాద్ తదితర నగరాల్లో బస్సులను నడుపుతున్నట్టు ఎంఈఐఎల్ గ్రూపు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.