Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
- నవంబరు 15న వరంగల్‌లో 'తెలంగాణ విజయగర్జన...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ పార్టీ సంస్థాగత నిర్మాణమంతా పూర్తయిన నేపథ్యంలో... రాష్ట్ర అధ్యక్షుణ్ని ఈనెల ఈనెల 25న ఎన్నుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఈనెల 17 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. కరోనాతోపాటు వరస ఎన్నికల వల్ల స్తబ్దతతో రెండేండ్లపాటు ప్లీనరీని నిర్వహించలేకపోయామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు గ్రామ, మండల కమిటీలన్నింటినీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నామని అన్నారు. ఈ ఎన్నిక అనంతరం జిల్లా అధ్యక్షులను ఆయా కమిటీలు ఎన్నుకుంటాయని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు తదితరులతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్లకు 22ను తుది గడువుగా నిర్ణయించామనీ, 23న వాటి స్క్రూట్నీ, 24న ఉపసంహరణ, 25న ప్రతినిధుల సభ జరుగుతాయని వివరించారు. అదే రోజు నూతన అధ్యక్షుణ్ని ఎన్నుకుంటామని తెలిపారు. ఆరోజే హైదరాబాద్ హైటెక్స్‌లో ప్లీనరీని నిర్వహిస్తామని తెలిపారు. ఆ ప్లీనరీకి దాదాపు 14 వేల మందిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈనెల 17న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశాన్ని కూడా నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారిగా శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షణ అధికారిగా పర్యదా కృష్ణమూర్తి వ్యవహరిస్తారని చెప్పారు. తీర్మానాల కమిటీకి మాజీ స్పీకర్ మధుసూదనాచారి చైర్మెన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి ఇరవై ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 27న ద్విశతాబ్ది సభ సన్నాహక సమావేశాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని కిందిస్థాయి శ్రేణులకు పిలుపునిచ్చారు. దానికి కొనసాగింపుగా నవంబరు 15న వరంగల్‌లో 'తెలంగాణ విజయగర్జన...' పేరిట సభను నిర్వహించబోతున్నామని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి వార్డు, గ్రామ, మండల, డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలందరూ విజయగర్జనకు తరలిరావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.