Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్‌కు డీఎంకే ఎంపీల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను రద్దు చేసేందుకు సహకరించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో డీఎంకే ఎంపీలు టీకేఎస్ ఎలగోవన్, కళానిధి వీరసామి కలిసి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ అంశంపై తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కేంద్రం విధానంపై నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కీలకమైన విషయాల్లో రాష్ట్రాల అభిప్రాయం తీసుకోవడం లేదన్నారు. నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని అందించారు. నీట్ రద్దుకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారని గుర్తు చేశారు. డీఎంకే ఎంపీలు కేటీఆర్‌ను కలిశారనీ, లేఖను ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి చెప్పారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.