Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.కోట్లు 'వ్యర్థ'మేనా..?
- ఎరువుల ఉత్పత్తే లేదు.. నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు
- ఒక్కో షెడ్డుకు రూ.2.50 లక్షలపైనే వ్యయం
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,068 పంచాయతీలు
- 26.70 కోట్లకు పైన ప్రజాధనం 'వృథా'
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'' సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ చిరునామాగా మారుతున్నది. చెత్త సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నాం. కాదేది అనర్హం అంటూ వ్యర్థాల నుంచి సంపద సృష్టి జరుతుంది..'' ఇదీ పట్టణ, పల్లె ప్రగతిపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1,068 పంచాయతీల్లో వ్యర్థాల నుంచి పది పంచాయతీల్లోనూ సంపద సృష్టి జరగడం లేదని పరిశీలకులు అంటున్నారు. గ్రామపంచాయతీల్లో పరిశుభ్రత కోసం తడి, పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేయాలనీ, తద్వారా వ్యర్థాల నుంచి కూడా సంపద సృష్టి జరగాలని తెలంగాణ ప్రభుత్వ సంకల్పం. పల్లె ప్రగతిలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 12,765 పంచాయతీల్లో కంపోస్టు షెడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే అత్యధిక షెడ్ల నిర్మాణం పూర్తయింది. ఒక్కో షెడ్డుకు రూ.2.50 లక్షలకుపైగా వెచ్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 44 మండలాల్లో 1,068 పంచాయతీలుండగా దాదాపు అన్ని పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. ఖమ్మం జిల్లాలో పెద్దతండా, ఏదులాపురం పంచాయతీలు మినహా మిగిలిన 587 పంచాయతీల్లో కంపోస్టు షెడ్లు నిర్మించారు. కానీ ఇప్పటివరకు రెండు జిల్లాల్లో కలిపి పట్టుమని పది పంచాయతీల్లోనూ కిలో కంపోస్టు తీసిన దాఖలాలు లేవు. తద్వారా ఉమ్మడి జిల్లాలో రూ.26.70 కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. కాగా, ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం సువర్ణాపురం, ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల షెడ్లను 'నవతెలంగాణ' సందర్శించింది.
చెత్తశుద్ధిలో లోపిస్తున్న చిత్తశుద్ధి
చెత్తశుద్ధిలో ప్రభుత్వ లక్ష్యం ఘనంగా ఉన్నా ఆచరణలో చిత్తశుద్ధి లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో చెత్తవరకు సేకరిస్తున్నా.. పొడి చెత్త మినహా తడి చెత్త పెద్దగా రావట్లేదని నిర్వాహకులు చెబుతున్నారు. తడి చెత్త లేకుండా కంపోస్టు తయారీ దాదాపు అసాధ్యం. పశువుల పెంట, అరటితొక్కలు, పాడైన కూరగాయలు పశువులకు మేతగా వేస్తారు. మాంసం వ్యర్థాలు, కోడిగుడ్డు పెంకుల వంటివి పెంటలో కలిపేస్తారు. వేసే పొడి చెత్తలో ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాల వంటివి మినహా గడ్డీగాదం వంటివి రోజుకు పది కిలోలు కూడా రావడం లేదు. సేకరించిన అరకొర తడిచెత్తను కూడా సెగ్రిగేషన్ షెడ్డుకు చేరాక ఒకచోటే పోస్తున్నారు. 20 శాతం పంచాయతీల్లోనే ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాలు, పాత వస్తువుల వంటివి వేరు చేసి సెగ్రిగేషన్ షెడ్లో కేటాయించిన చోట వేస్తున్నారు. చాలాచోట్ల చెత్తను డంపింగ్‌యార్డులో పోసి నిప్పు పెడుతున్నారు. అరకొరగా సేకరించిన తడి, పొడిచెత్తనూ కొన్నిచోట్ల షెడ్ల వెలుపల పోస్తుండటంతో కుక్కలు, పం దులు స్వైరవిహారం చేస్తున్నాయి. సేకరించిన మాంసం వ్యర్థాలను షెడ్లలోనో, వెలుపలో పడవేస్తుండ టంతో కుళ్లి పోయి దుర్గంధం వస్తున్నది. షెడ్ల పరిసరాల్లో వర్షాలకు గొతులు ఏర్పడి నీళ్లు నిలిచి దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి.
అతికొద్ది పల్లెల్లోనే కంపోస్టు తయారీ
ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం లక్ష్మీపురం, పమ్మి, బోనకల్ మండలాల్లోని ఒకటి, రెండు పంచాయతీలు, ఖమ్మం రూరల్‌లోని ముత్తగూడెం, పల్లెగూడెం వంటి పదిలోపు పంచాయతీలనే ఆదర్శంగా చూపుతున్న అధికారులు.. మిగిలిన వాటి గురించి నోరు మెదపడం లేదు. ముదిగొండ మండలం సువర్ణాపురంలో కంపోస్టు షెడ్డు పరిసరాల్లో నాటేందుకు తెచ్చిన మొక్కలు ఎండిపోయి కనిపించాయి.
ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులలో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు మినహా కంపోస్టు తయారీ ఆనవాళ్లు కూడా కనిపించలేదు. పైగా షెడ్డు సమీపంలోనే సేకరించిన వ్యర్థాలను కుప్పలుగా పోశారు. వర్షపు నీటితో ఆ వ్యర్థాలు కలిసి దుర్గందం వెదజల్లుతున్నాయి. ఈ రెండు మండలాల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి ఉంది. 'నవతెలంగాణ నెట్వర్క్' ద్వారా అందిన సమాచారం ప్రకారం.. సెగ్రిగేషన్ షెడ్లు అలంకారప్రాయంగా మారాయి తప్ప కిలో కంపోస్టు తీసిన దాఖలాలు లేవు. ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లో కంపోస్టు తయారు చేస్తామన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్ దాన్ని ఎక్కడ ఆచరణలో పెట్టినట్టు కనిపించడం లేదు.
కనిపించని వానపాములు?
వానపాములు లేకుండా సేంద్రియ ఎరువు తయారీ సాధ్యపడదు. ఇందుకోసం పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్‌లు వానపాములు కొనుక్కొచ్చారు. వాటిని తీసుకొచ్చి ఉన్న కొద్దిపాటి చెత్తలో వదిలారు. కానీ ఓ పద్ధతి ప్రకారం వీటిని వ్యర్థాల్లో వదిలితేనే వర్మీ కంపోస్టు తయారవుతుంది.
తడి చెత్తలో ఉన్న షాంపూ ప్యాకెట్లు, గుడ్డు పెంకుల వంటివి వేరు చేయాలి. ఆ తర్వాత కొబ్బరిడొప్పులు లేదా పీచు, ఎండుగడ్డి, ఎండుపేడ, ఎండబెట్టిన తడిచెత్త ఇలా ఒకదానిపైన ఒకటి పేర్చి కొద్దిరోజుల పాటు నీళ్లుపోసిన తర్వాత ఒక చదరపు మీటర్‌కు వెయ్యి వానపాముల చొప్పున వదలాలి. ఇలా 45 నుంచి 60 రోజుల పాటు ఉంచితే వానపాములు దానిలోనే పిల్లలు చేస్తాయి. ఇలా చ||మీకు కేజీ చొప్పున 600 వానపాములు చివరకు 3000 వానపాములుగా వృద్ధి చెందుతాయి. అవి వ్యర్థాలను గుల్ల చేయడం ద్వారా కంపోస్టు తయారవుతుంది. ఓ ప్రత్యేకయంత్రం ద్వారా వానపాములు, ఎరువును వేరుచేయాలి. ఆ వానపాములను మిగిలిన వ్యర్థాలను గుల్ల చేసేందుకు ఉపయోగించాలి. ఎరువును పల్లెల్లో ప్రగతి వనాల నిర్వహణ, హరితహారం మొక్కలు, ఎవెన్యూ ప్లాంటేషన్ తదితరాలకు వినియోగిస్తారు. మిగిలిన ఎరువును విక్రయిస్తారు. కానీ ఇవేవీ ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్కచోట ఆచరణలో లేవు.
పల్లెల శుభ్రతకు పాటుపడుతున్నాం..
పల్లెల శుభ్రతకు పాటుపడుతున్నాం. మంగళ, శుక్రవా రాలు డ్రైడేలు నిర్వహిస్తున్నాం. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఊళ్లలో వేర్వేరు డబ్బాలు ఇచ్చాం. కానీ చాలామంది తడిపొడి చెత్తను కలిపివేస్తున్నారు. 300 జనాభా ఉన్న పంచాయతీలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఇటువంటి చిన్న పంచాయతీల్లో చెత్త పెద్దగా రావడం లేదు. గ్రామాల్లో పండ్లు, కూరగాయల వ్యర్థాలను ప్రత్యామ్నాయ అవసరాలకు వినియోగిస్తుండటం వల్ల తడిచెత్త పెద్దగా రావడం లేదు. ఉన్నంతలో సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా ఎరువు ఉత్పత్తి చేస్తున్నాం. మొక్కలకు వినియోగిస్తున్నాం.
- ప్రభాకర్‌రావు, ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి