Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ కాలేజీల్లో పాతవారినే కొనసాగించాలి :ఇంటర్ విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లనే 2021-22 విద్యాసంవత్సరంలోనూ కొనసాగించాలని ఇంటర్మీడియెట్ విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల్లో ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. దసరా సెలవుల తర్వాత కాలేజీలు పున:ప్రారంభమవుతాయనీ, అందువల్ల ఈనెల 18 నుంచే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 గెస్ట్ లెక్చరర్లను నియమించాలని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి రోనాల్ రోస్ జీవోనెంబర్ 1293ని విడుదల చేసిన విషయం తెలిసిందే. గత విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని ప్రకటించారు. ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల్లో వారిని ఐదు నెలల కోసమే పార్ట్‌టైం ప్రాతిపదికన తీసుకుంటున్నామని వివరించారు. అయితే గతంలో పనిచేసిన వారు అందుబాటులో లేని ఖాళీల్లో కొత్తవారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఆయా సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని కోరారు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాలని సూచించారు. ఎంపికైన వారి వివరాలను డీఐఈవోలకు పంపించాలని ఆదేశించారు. గత విద్యాసంవత్సరంలో పనిచేసిన వారినే ప్రస్తుత విద్యాసంవత్సరంలో కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి, అధికారులకు గెస్ట్ లెక్చరర్ల సంఘం (2152) రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అతిధి అధ్యాపకుల జేఏసీ అధికార ప్రతినిధి దేవేందర్ యాదవ్ కుంట కృతజ్ఞతలు తెలిపారు.