Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లో క్వింటా రూ.8వేలు... సీసీఐ ధర రూ 6025లే...
- నష్టపోతున్న రైతులు
- భారీ వర్షాలకు పంట నష్టం
- గతేడాది కంటే తగ్గిన విస్తీర్ణం
ఒకవైపు భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట...మరోవైపు చేతికొచ్చిన పంటకు సరైన ధర అందకపోవడం వెరసీ రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. అధిక ధర సాకుతో ప్రయివేటు వ్యాపారులు వారిని మోసం చేస్తున్నారు. 'తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. పోటీపడి వ్యాపారులు మన పత్తిని కొంటారు' అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పదే పదే చెబుతుంటారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉంటున్నది. ఆరుగాలం కష్టించిన రైతుకు చివరికి నష్టాలే మిగులుతున్నాయి...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పత్తికి సీసీఐ నిర్ణయించిన ధర అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీ సం ప్రస్తావనలేదు. మరోవైపు బహిరంగ మార్కెట్లో మంచి ధర పలుకుతుందంటూ ప్రభుత్వం గొప్పగా చెబుతున్నది. కానీ ప్రయి వేటు వ్యాపారులు ఎక్కువ ధర ఇచ్చినా... విపరీతమైన నిలువు దోపిడీ ఉంటుందనేది తెలిసిందే. ప్రస్తుతం సీసీఐ నిర్ణయించిన మేరకు ధరను పెంచి, నేరుగా కొనుగోలు చేస్తేనే తమకు న్యాయం జరుగుతుం దంటూ రైతులు చెబుతున్నారు. సీసీఐ పత్తికి నిర్ణయించిన క్వింటాల్ మద్దతు ధర రూ.6025 ఉన్నది. దానిని రూ.9 వేలకు పెంచితేనే తమకు గిట్టుబాటు అవుతుందని చెబుతు న్నారు. పత్తి మద్దతు ధరలకు ప్రాణం పోయా లంటూ రైతులు కోరుతున్నారు. తాజాగా క్వింటాల్ పత్తికి మహారాష్ట్రలో రూ 13వేలు, కర్నూల్లో రూ.8350, ఖమ్మంలో రూ.7వేల ధర పలుకున్నది. ఈ నేపథ్యంలో సీసీఐ మద్దతు ధర పెంచడంతోపాటు కొనుగోలు కేంద్రాలను పెంచాలంటూ రైతుసంఘం డిమాండ్ చేస్తున్నది. మరోవైపు బహిరంగ మార్కెట్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
తగ్గిన సాగు విస్తీర్ణం
వానాకాలం సీజన్లో భారీ వర్షాలకు పంట నష్టం బాగా జరిగింది. జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు పడ్డాయి. జూన్‌లో పత్తి విత్తనాలు వేస్తే మొలకెత్తలేదు. దీంతో రెండోసారి మళ్లీ విత్తనాలు వేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో రైతులు ఆర్థికంగా బాగా చితికిపోయారు. అప్పులపాయ్యారు. గతేడాది 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైతే, ఈసారి 47 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంతో గతేడాది కంటే 3 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. వేసిన పంట కూడా వానలకు దెబ్బతిన్నది. ఎర్రబారింది. పూత రాలిపోయింది. చాలా చోట్ల పొలాల్లో నీరు చేరి చేను కిందపడిపోయింది. దీంతో రైతు రెండు విధాలుగా నష్టపోయారు. ఈ క్రమంలో పత్తి ఉత్పత్తి తగ్గిపోయి దిగుబడి పడిపోయింది. ఇదే సమయంలో వీలైనంత వరకు పత్తిని నిల్వ చేసేందుకు ప్రయివేటు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. 2020 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీస్థాయిలో వానలు పడ్డాయి. సుమారు రూ 20వేల కోట్లనష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టం అంచనా వేయలేదు. రైతులకు పరిహారం అందలేదు. ఈ నేపథ్యంలో పత్తి రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పండించిన పత్తికి సరైన ధర అందకపోవడంతో వారు ఇబ్బందులుపడుతున్నారు. పత్తి చేతికందే దశలో సీసీఐ 145 కేంద్రాలను ఏర్పాటుచేయాల్సి ఉండగా, 121 కేంద్రాల్లోనే ఏర్పాటు చేసింది. దీంతో రైతులు ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయించి, తీవ్రంగా నష్టపోతున్నారు.
గతేడాది కంటే రెండు వందలే ఎక్కువ
పత్తికి మద్దతు ధర గతేడాది రూ.5825 ఉంటే, ఈ సారి రూ.6025కు పెరిగింది. అంటే ఈసారి దాన్ని సీసీఐ రూ 200 మాత్రమే పెంచింది. ప్రకృతి వైపర్యీతాల వల్ల పంట దిగుబడి బాగా తగ్గిపోవడంతో పత్తికి డిమాండు పెరిగింది. దీన్ని ఆసరా చేసుకుని ప్రయివేటు వ్యాపారులు రంగంలోకి దిగారు. సీజన్ కంటే ముందుగానే రైతుకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇవ్వడంతో రైతు ఆ వ్యాపారికి తమ పంటను అమ్మక తప్పని పరిస్థితి. పత్తికి ధర ఎక్కువ ఇస్తున్నా... 'తేమ ఎక్కువగా ఉంది. తెల్లబంగారం నల్లంగా మారిందంటూ తరుగుపేరుతో క్వింటాల్ కంటే పది కిలోలకు పైగా ఎక్కువగా జోకుతారు. అమ్మిన రైతుకు డబ్బు వెంటనే ఇవ్వకుండా రీసెల్ తర్వాత చెల్లిస్తారు. ప్రయివేటు వ్యాపారులు పత్తి నుంచి గింజలు తీసి, బేళ్లుగా మార్చి తిగిరి సీసీఐకే అమ్ముతుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల పంట పడుతుంది'. కానీ రైతుకు నయా పైసా లాభం లేదు. దీంతో వారు పెట్టుకున్న ఆశలు ఆడియాశలవుతున్నాయి.