Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మాజీ మంత్రి, గతంలో టీడీపీ, ఇప్పుడు బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు... గులాబీ గూటికి చేరుకోబోతున్నారు. సోమవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎన్టీఆర్ హయాం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత ఆయనతోపాటు చంద్రబాబు మంత్రివర్గాల్లో చోటు సంపాదించుకున్న మోత్కుపల్లి.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన్ను పలుమార్లు విమర్శించి వార్తల్లోకెక్కారు. అప్పుడు మోత్కుపల్లి వైసీపీకి దగ్గరగా ఉంటున్నారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీలో నర్సింహులు ఇమడలేకపోతున్నారనే చర్చ ఈ మధ్య కొనసాగింది. ఇదే సమయంలో ఆయన బీజేపీ నిర్ణయాన్ని కాదని, సీఎం కేసీఆర్... దళిత బంధుపై నిర్వహించిన కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అప్పుడే ఆయన టీఆర్ఎస్లోకి మారబోతున్నారనే వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఆయన ఇప్పుడు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు దళిత బంధు పథకం రాష్ట్ర చైర్మెన్ పదవిని మోత్కుపల్లికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. ఈ హామీతోనే ఆయన కారు పార్టీలోకి చేరబోతున్నారని తెలిసింది.