Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'లఖింపూర్ ఖేరి' ఘటనపై ప్రజాసంఘాల నిరసన
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను భర్తరఫ్ చేసేంత వరకూ పోరాడుతామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ హెచ్చరించారు. ఆ ఘటనను నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ... స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ... రైతులను ఘోరంగా చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మోడీ... మొండిగా వ్యవహరిస్తే గద్దె దిగక తప్పదని హెచ్చరించారు. పశ్య పద్మ మాట్లాడుతూ... వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్న అన్నదాతలను మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రా తన అనుచరులు, గుండాలతో కలిసి కార్లతో తొక్కించటం దారుణమని తెలిపారు. తద్వారా నలుగురు రైతుల మరణానికి కారణమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత అమానుషమైన ఈ ఘటనపై దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిందని చెప్పారు. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే వారి తలలు పగలగొట్టండి.. కేసులొస్తే నేను చూసుకుం టానంటూ హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ దుహంకారంతో బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులను రెచ్చగొట్టారని తెలిపారు. రైతులను లేపేయటం రెండు నిమిషాల పనంటూ అజరు మిశ్రా కూడా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. వీరిద్దరి ప్రసంగాలే ఈ ఘటనకు కారణమన్నారు. కేంద్రంలోని బీజేపీ పభుత్వం రైతాంగ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎన్ని కుట్రలు పన్నినా... ఉద్యమం మరింత ఉధృతమవుతుందే తప్ప నీరుగారి పోదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వల్లపు ఉపేందర్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్ది, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బి ప్రసాద్, ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆంజనేయులు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రైతాంగ సమితి రాష్ట్ర నాయకులు ధర్మ పాల్ తదితరులు పాల్గొన్నారు.