Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద మైనార్టీలను ఆదుకోవాలి
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవ తెలంగాణ- నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ బంధు పథకం వెంటనే ప్రకటించి పేద మైనారిటీలను ఆదుకోవాలని అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆవాజ్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికంతో బాధలు పడుతున్న పేద మైనార్టీలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రతి పేద మైనారిటీ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మైనారిటీల ఆర్థిక, సామాజిక పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కోవిడ్-19 లాక్డౌన్ల ప్రభావంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. 92శాతం మంది మైనారిటీలు అసంఘటిత రంగంలో అస్థిరమైన ఆదాయ వనరులపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. చిన్న చిన్న వృత్తులు, వ్యాపారాలు చేసుకునేవాళ్లు, ఆటో, టాక్సీల డ్రైవర్లు, మెకానిక్స్, స్ట్రీట్ వెండర్స్ అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి కిరాయిలు, పిల్లల బడి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. వీరి అభివృద్ధికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కంటితుడుపు సానుభూతి మాటలు, ఇఫ్తార్ విందులు, రంజాన్ తోఫాలు మైనారిటీల జీవితాల్లో ఎలాంటి మార్పులు తేలేవన్నారు. మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేసిన సుధీర్ కమిషన్ నివేదిక సిఫార్సు ప్రకారం బడ్జెట్ సబ్ ప్లాన్ అమలు చేయాలనీ, పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేసి పేద మైనార్టీలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆవాజ్ పట్టణ అధ్యక్షులు ఎస్కే మహబూబ్ అలీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాశమ్, నన్నేసాహెబ్, ఆయూబ్, ఎజాజ్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
బషీర్ ఖాన్ సంతాప సభ...
ఆవాజ్ నల్గొండ పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తూ సెప్టెంబర్లో అనారోగ్యంతో మరణించిన మొహమ్మద్ అబ్దుల్ బషీర్ ఖాన్ మరణం ఉద్యమానికి తీరని లోటని రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ అన్నారు. ఆదివారం దొడ్డి కొమురయ్య భవన్లో బషీర్ ఖాన్ సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాషం, కేవీపీఎస్్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, యూటీిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పాల్గొని మాట్లాడారు. ప్రజా ఉద్యమాల పట్ల అంకిత భావంతో పని చేసే వారని కొనియాడారు.