Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయినా అప్రమత్తంగా ఉండాలి
- అందరిని కలిపే అలరు-బలరు : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామనీ, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, అచార వ్యవహారాలకు ప్రతీక అని... అందులో ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలరు-బలరు కార్యక్రమం అని తెలిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జల్ విహార్‌లో ఆదివారం నిర్వహించిన అలరు - బలరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశ సంస్కతి సంప్రదాయాలు- ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుందని వెంకయ్య ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశానికే ప్రత్యేకమైన అస్తిత్వం ఇంకా నిలబడి ఉండడానికి కారణం మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణేనన్న ఉపరాష్ట్రపతి, అలరు-బలరు కూడా అలాంటి కార్యక్రమమేనని అభిప్రాయపడ్డారు. స్వరాజ్య ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఏకం చేసేందుకు వీలుగా వినాయక చవితి ఉత్సవాలకు బాలగంగాధర్ తిలక్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ప్రజలందరిలో ఏకతా భావాన్ని నింపేందుకు 13 ఏండ్లుగా అలరు బలరు కార్యక్రమాన్నినిర్వహించడం అభినందనీయమన్నారు.
ప్రజలంతా ఒకే చోటకు చేరి మంచి ఆలోచనలు పంచుకున్నప్పుడు ఏదైనా సాధించేందుకు వీలు పడుతుందని, తోటి వారిని ఎలా గౌరవించుకోవాలో అలరు - బలరు లాంటి కార్యక్రమాలు తెలియజేస్తాయని వెంకయ్య చెప్పారు. స్వరాజ్య ఉద్యమ సమయంలో సంస్కృతిని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు జరిగినా, ప్రాణాలను సైతం లెక్క చేయక నాటి మహనీయులు ఆచార వ్యవహారాలను పరిరక్షించారని తెలిపారు. వారి త్యాగాల ద్వారా అందిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ.. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యర్థులే....శతృవులు కాదు: కవిత
రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారనీ, శతృవులు ఉండరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ ఈ వేడుకలో వారూ, వీరూ అనే బేధం లేకుండా అన్ని పార్టీల వారిని పిలవడం ద్వారా దత్తాత్రేయ నిజమైన దసరా స్ఫూర్తిని గుర్తు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిగా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ వేదికలో అన్ని పార్టీలకు చెందిన నాయకులతో కలిసి కూర్చోడం చాలా బాగుందన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు మంచి సందేశమని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర హౌం శాఖ మంత్రి మహమూద్ అలీ, సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ వైద్యులు నాగేశ్వర రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అధినేత సతీష్ రెడ్డి, భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు కృష్ణ యెల్లా, బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి మహిమా దత్తా, మా అధ్యక్షులు మంచు విష్ణు, సినీ నటులు కోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.