Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరానికి గతంతో పోలిస్తే ఇప్పటికే రూ. 30వేలకు పైగా పెట్టుబడి అధికం
- అధిక వర్షాలతో పెట్టుబడులపై భారం
- ఖమ్మంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో పెరిగిన సాగు
- రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల ఎకరాల్లో సేద్యం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పత్తి, వరి తదితర పంటలు ఏటా రైతాంగాన్ని నష్టాల్లో ముంచుతుండటంతో ఈ ఏడాది మెజారిటీ రైతులు మిరప సాగు వైపు మొగ్గు చూపారు. ఎకరం వేసే రైతు రెండు, మూడు ఎకరాలు వేశారు. కొందరైతే 'ముంచినా మిరపే... తేల్చినా మిరపే' అనే మొండి ధైర్యంతో తమకున్న పొలంతో పాటు రెండింతలు కౌలుకు తీసుకొని సేద్యం చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3,58,557 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాదితో పోల్చితే 1,17,766 ఎకరాల్లో మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 67శాతం సాగు విస్తీర్ణం పెరగగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే 56.86శాతం విస్తీర్ణం పెరగడం గమనార్హం. అయితే రైతుల ఆశలను అడియాసలు చేస్తూ ఈ ఏడాది అన్ని పంటలతో పాటు మిరపనూ అధిక వర్షాలు దెబ్బతిస్తున్నాయి. తద్వారా ప్రస్తుత పూత దశ వరకు ఎకరానికి రూ.25,000 పెట్టుబడులు కావాల్సి ఉండగా రూ.50 నుంచి రూ. 60 వేల వరకూ పెట్టుబడులు అవుతుండటంపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అధిక వర్షాలతో డబుల్ పెట్టుబడులు
అధిక వర్షాలతో అన్ని పంటలతో పాటు మిర్చికీ పెట్టుబడి భారీగా పెరిగిందని రైతులు వాపోతున్నారు. వర్షాలకు తోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం ఎరువులు, పురుగు మందులపై పడిందంటున్నారు. దున్నుడు, పిచికారీ యంత్రాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కూలీ రేట్లు అధికమయ్యాయని వాపోతున్నారు. గతంలో ఎకరం పంట ఉత్పత్తికి రూ. 60 వేలలోపు పెట్టుబడి అయితే ఇప్పుడది రూ.1.20 లక్షలకు పైగా అయ్యే అవకాశం ఉందంటున్నారు. అధిక వర్షాలతో ఒక్క ఖమ్మం జిల్లాలోనే 417 మంది రైతులకు పైగా చెందిన 600 ఎకరాలకు పైగా మిర్చి పంట వర్షం పాలైంది. ఈ ఏడాది సాధారణానికి మించి జూన్‌లో 82.2, జులైలో 55.4, సెప్టెంబరులో 81.2 మి.మీ చొప్పున అధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం మిరుప నాటే దశ నుంచి పూత, పిందె దశ వరకు ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా రైతులు వర్షాలకు మొక్కలు కొట్టుకుపోవడం, అధిక తేమతో వేర్లు కుళ్లి మొక్కలు చచ్చిపోవడంతో రెండుసార్లు నాట్లు వేశారు. ఎకరానికి దున్నుడు కూళ్లు, ఫ్లవ్ వేసినందుకు రూ.10వేలు, మిరుప నారుకు రూ.20వేలు, నాటినందుకు రూ. 4వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ.15వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. అధిక వర్షాలకు మిరుపలో కాండం కుళ్లు, వేరు కుళ్లు, ఆకు ముడత, పండాకు, బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగుళ్ల వంటివి వ్యాప్తి చెందడం, కలుపు ఉధృతంగా పెరగడం తదితర కారణాలతో పెట్టుబడులు ఇప్పటికే ఎకరానికి రూ. 60 వేలకు చేరినట్టు రైతులు చెబుతున్నారు. పంట చేతికి వచ్చే నాటికి పెట్టుబడి రూ.1.50 లక్షలకు చేరిన ఆశ్చర్యం లేదంటున్నారు. ఇంతచేస్తే చివరకు ధరలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న సాగు విస్తీర్ణం.. తగ్గుతున్న ధరలు
పత్తి సాగు ఆశాజనకంగా లేకపోవడంతో గత మూడేండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 2019-20 సంవత్సరంలో 2,21,009, 2020-21లో 2,40,791, 2021-22లో 3,58,557 ఎకరాల్లో మిర్చి సాగుచేశారు. దీనికితోడు రాష్ట్రంలో పండిన మిర్చి చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, థారులాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఎగుమతి అవుతుండటంతో పంటకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎగుమతుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలే ముందంజలో ఉన్నాయి. కానీ ధరల్లో స్థిరత్వం లోపిస్తోంది. గతేడాది రూ.23,000 పలికిన క్వింటాల్ మిర్చి ఈ ఏడాది రూ.16,000 దాటకపోవడం, పెట్టుబడులు భారీగా పెరుగుతుండటంతో రైతాంగం ఆందోళనలో పడుతోంది. ఈ ఏడాది పంట చేతికి వచ్చేనాటికి ధరల్లో పెరుగుదల ఉండాలని ఆశిస్తోంది. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చే మిర్చికి కనీసం క్వింటాల్ రూ. 18,000 చొప్పున ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతాంగం అంటోంది.
అధిక వర్షాలతో అదనపు పెట్టుబడి
పత్తితో ప్రయోజనం లేదని ఈ ఏడాది అధిక మొత్తంలో మిర్చి సాగు చేపట్టాను. గతేడాది ఎకరంన్నర మిర్చి వేస్తే ఈ ఏడాది రెండున్నర ఎకరాలు వేశాను. కానీ ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. మిర్చి ఇంకా పూత దశకూ రాలేదు. ఇప్పటికే ఎకరానికి రూ.40వేలకు పైగా పెట్టుబడి అయింది. పంట చేతికి వచ్చే నాటికి రూ.1.20 లక్షల వరకూ పెట్టుబడి అవుతుందని అంచనా వేస్తున్నాం. అధిక వర్షాలకు రెండు సార్లు మొక్కలు నాటాల్సి వచ్చింది. చావు మొక్కలు కూడా అధికంగా పోయాయి. ఇప్పటికే ఎకరానికి రూ. 20వేలు అదనపు పెట్టుబడి అయ్యింది. పత్తి గిట్టుబాటు కావడం లేదని మిర్చి వేస్తే ఈ ఏడాది మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు మిర్చి ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచిన మిర్చినే క్వింటాల్ రూ.14వేల ధర పలుకుతోంది. ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది కాబట్టి పంట చేతికి వచ్చేనాటికి గిట్టుబాటు ధర ఉంటుందో లేదోనని ఆందోళనగా ఉంది. క్వింటాల్ మిర్చి రూ.18వేలకు పైగా ఉంటేనే గిట్టుబాటు అవుతుంది.
- వనవాసం రాంరెడ్డి, గుండెపూడి,
మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా
సస్యరక్షణ చర్యలు కీలకం
ఈ ఏడాది అధికవర్షాలు కురుస్తుండటంతో పంటలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. తద్వారా అన్ని పంటలకూ అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఇటువంటి సమయంలో సస్యరక్షణ చర్యలు కీలకం. వర్షాలకు 600 ఎకరాల్లో మిర్చి పంట నీటి పాలైంది. ప్రస్తుతం మిరుప నాటే దశ నుంచి పూత, పిందె దశ వరకు ఉంది. వర్షాలు తగ్గిన వెంటనే నీరు నిల్వకుండా చూడాలి. పండాకు, కాండం కుళ్లు తెగులు ఆశిస్తే ప్రోసేట్ మిథేల్ 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు గమనిస్తే కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కలకు పోషకాలు అందించాలి.
- డాక్టర్ హేమంత్ కుమార్,
కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, వైరా, ఖమ్మం