Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ చర్చా వేదికలో..
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనతోపాటు కుల గణన చేపట్టాలనీ, వెనుకబడిన తరగతుల వారి స్థితిగతులు తెలుస్తాయనీ, అప్పుడే వారి ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవచ్చని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 'కుల గణన ఆవశ్యకత' అనే అంశంపై రాష్ట్ర కన్వీనర్ మేకపోతుల వెంకటరమణ అధ్యక్షతన చర్చావేదిక నిర్వహించారు. ఈసందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం రాక ముందు 1931లో బ్రిటిష్ వారు చేసిన సర్వే రిపోర్టునే నేటికీ చెప్పడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో కుల గణన చేపట్టలేమని చెప్పడం ఎంతవరకు సబబు అన్నారు. కుంటి సాకులు చెప్పి తప్పించుకుందామని చూస్తోందని విమర్శించారు. కులగణనతో ఆయా తరగతుల సంఖ్య, ఆర్థిక అసమానతలు బయటపడి హక్కుల కోసం పోరాటాలు చేస్తే తన మత ఎజెండా ముందుకు పోదు అనే ఉద్దేశంతోనే బీజేపీ కులగణన చేపట్టడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా టీఆర్ఎస్ వైఖరి ఉండాలని అన్నారు. ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎన్. వినయ కుమార్ మాట్లాడుతూ.. పదేండ్లకు ఒకసారి చేసే జనగణనలో.. ఎస్సీ, ఎస్టీలతోపాటు బీసీలు తదితర కులాల వారి గణన చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన మనం కుల గణన చేపట్టడం కష్టమేమీ కాదని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశాయన్నారు.
వామపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.నరేష్, పి. ఆశయ్య, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లేశం, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సాయన్న, వెంకటకృష్ణ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బడుగు శంకరయ్య, ఒగ్గు జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లం పరమేష్, బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నారావ్, బీసీ ఏ రిజర్వేషన్ పరిరక్షణ ప్రధాన కార్యదర్శి గుర్రప్ప, రజక ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు శంకర్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, రాష్ట్ర నాయకులు విగేష్ గణేష్, జ్యోతి ఉపేందర్ తదితర సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.