Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆందోళన
- తక్కువ ధరకే దళారులకు పంట విక్రయం
- వేధిస్తోన్న కూలీల కొరత
- వర్షాలతో రైతన్న బిక్కుబిక్కు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్నా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాడలేదు. ఫలితంగా రైతులు తక్కువ ధరకు వ్యాపారస్తులకు, దళారులకు విక్రయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కూలీల కొరత, అకాల వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే వందల ఎకరాల్లో పంటలు నీట మునిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసిముద్దయ్యింది. రాష్ట్ర సర్కారు యుద్ధప్రతిపాదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ యేడాది 2,07,606 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. మే మూడోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు పంటలు వేశారు. మొదట్లో పంటలు వేసిన రైతుల వరి ఇప్పుడు కోతకు సిద్ధమయ్యింది. అక్టోబర్ మొదటివారం నుంచే వరి కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వర్ని, చందూరు, రుద్రూరు, కోటగిరి తదితర మండలాల్లో రైతులు పంటలను కోసి ఇప్పటికే విక్రయించారు. జిల్లాలో ముందుగా ఉమ్మడి వర్నిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ మండలంలో మొత్తం 30 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా.. 30 శాతానికి పైగా పంట కోతలు చేపట్టారు. ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధర గ్రేడ్-ఏకు రూ.1960, గ్రేడ్-బికి రూ.1940 ప్రకటించింది. కానీ ప్రస్తుతం రైతులు దళారులకు, వ్యాపారులకు రూ.1250 నుంచి రూ.1330 మధ్యలో విక్రయిస్తున్నారు. అయితే రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఈ ధరనూ తగ్గించాలని దళారులు యోచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, వర్షాలతో రైతులు ఏ ధరకు అయినా తమకే విక్రయిస్తారని ధరలు తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ఈ కేంద్రాలకే ధాన్యాన్ని తరలించే అవకాశముండేది.
వేధిస్తోన్న కూలీల కొరత..
వ్యవసాయ పనులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరినాట్ల మొదలు ధాన్యం ఆరబెట్టడం వరకు కూలీలు దొరక్క రైతు ప్రయాసపడుతున్నాడు. దళారులు ధరను తగ్గించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వరకు వేచిచూద్దామనుకునే రైతులకు కూలీల కొరత వేధిస్తోంది. ఒకవేళ ధాన్యం కోసి ఆరబెట్టి మళ్లీ కుప్పలు ఊడ్చేవారు లేక కూడా రైతులు నేరుగా ధాన్యం కోసి వ్యాపారుల, దళారుల లారీల్లో ఎక్కిస్తున్నారు. ఇప్పటికే వర్ని మండల కేంద్రాల్లోని రోడ్డుకు ఇరువైపులా లారీలు, డీసీఎంలు క్యూ కట్టాయి.
వర్షాలతో భయం.. భయం..
జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల పలు మండలాల్లో పంటలు నీటమునిగాయి. మళ్లీ భారీ వర్షం కురిస్తే తాము అప్పులపాలవడం ఖాయమని వాపోతున్నారు. ఇప్పటికే వర్షాల వల్ల వరి కోత మిషన్లు పొలాల్లోకి కోతలకు రావట్లేదు. ధాన్యం సరఫరాకు సైతం ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. ఈ వర్షాలు, బురదను సాకుగా చూపి మిషన్లకు అదనంగా వసూలు చేస్తారని వాపోతున్నారు. ఇప్పటికే వరికోత మిషన్‌కు గంటకు ఏకంగా రూ.2600 వసూలు చేస్తున్నారు. గతేడాది రూ.2200 ఉండగా.. డీజిల్ ధరలు పెరగడంతో ఈ యేడాది ఏకంగా రూ.400 పెంచారు.