Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదు
- హుజూరాబాద్‌లో గెలిచేది మనమే.. అక్కడ టీఆర్ఎస్కు 13 శాతం ఓట్లెక్కువ...
- 26 లేదా 27న బహిరంగ సభలో పాల్గొంటా ొ వరంగల్‌లో 10 లక్షల మందితో విజయగర్జన : టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతంలో మాదిరిగా ముందస్తు ఎన్నికలకు పోయేది లేదని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నూటికి నూరు శాతం టీఆర్ఎస్సే గెలవబోతున్నదని చెప్పారు. ఇతర పార్టీలన్నింటితో పోలిస్తే... ఇప్పటికీ అక్కడ టీఆర్ఎస్కు 13 శాతం ఓట్లు అదనంగా ఉన్నాయని ఆయన తెలిపారు. పలు సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని వివరించారు. ఈనెల 26 లేదా 27న హుజూరాబాద్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొంటానని అన్నారు. ఈనెల 25న టీఆర్ఎస్ రాష్ట్ర ప్లీనరీని హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అదే రోజు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్లీనరీలో చర్చించాల్సిన అంశాలు, చేయాల్సిన తీర్మానాలతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యూహ, ప్రతి వ్యూహాలపై సమాలోచనలు చేసేందుకు ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి అధ్యక్షతన వహించిన కేసీఆర్... వారికి దిశా నిర్దేశం చేశారు. ప్రతిపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు తనను, తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ప్రజా ప్రతినిధులను నిలదీశారు. మాటకు మాట అన్నట్టుగా ఎదురు దాడి చేయాలని సూచించారు. ముందుగా అనుకున్న దానికి భిన్నంగా హైదరాబాద్‌లో నిర్వహించే ప్లీనరీకి కేవలం 6,500 మందిని మాత్రమే ఆహ్వానించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెడుతూ ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెప్పే విధంగా వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దాదాపు 20 వేల బస్సులను వినియోగించి, 10 లక్షల మందితో ఈ సభను జయప్రదంగా నిర్వహించటం ద్వారా ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే సమాధానం చెప్పాలని సూచించారు. ఈ సభను విజయవంతం చేయాలని కేసీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
రోజుకు 20 నియోజకవర్గాల నేతలతో సమావేశం...
మరోవైపు ప్లీనరీనీ, విజయ గర్జన సభను విజయవంతం చేసేందుకు వీలుగా సోమవారం నుంచి ప్రతిరోజూ 20 అసెంబ్లీ నియోకవర్గాల్లోని ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. వీటిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కే.కేశవరావు పర్యవేక్షించనున్నారు. వరంగల్ సభకు కేటీఆర్‌ను ఇన్ఛార్జిగా నియమించారు. ఆ సభకు ఒక్కో గ్రామం నుంచి ఒక్కో బస్సు వచ్చే విధంగా ప్లాన్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్లీనరీకి గ్రామ స్థాయి నాయకులను కూడా ఆహ్వానించాలని నిర్ణయించినా, కరోనా తోపాటు స్థలాభావ సమస్య వల్ల కేవలం ఎంపీపీలు, జడ్పీ టీసీల స్థాయి నాయకులనే పిలవాలని భావిస్తున్నట్టు సమా చారం. వరంగల్ సభకు సంబంధించి బస్సుల కేటాయిం పుపై సీఎం మాట్లాడుతూ... ఆర్టీసీ గురించి, దాని పరిస్థితి గురించి, అసలు ఎన్ని బస్సులు ఉన్నాయనే దాని గురించి మంత్రి పువ్వాడ అజయకుమార్ను అడగ్గా, ఆయన వెంటనే లెక్క చెప్పలేకపోయారని సమాచారం. దాంతో సీఎం ఆయనపై ఒకింత అసహనాన్ని ప్రదర్శించినట్టు తెలిసింది.
అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు...
టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణీదేవి, పట్నం మహేందర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ తదితరులు బలపరిచారు. ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 23న ఉదయం 11 గంటల వరకూ వాటిని పరిశీలించి, స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 24న మధ్యాహ్నం 3 గంటల వరకూ అనుమతిస్తామని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. 25న హెచ్ఐసీసీలో జరిగే ప్లీనరీలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఆయన వెల్లడించారు.