Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకాంక్షలను సాకారం చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో 20 నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈనెల 25న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ, నవంబర్ 15న జరిగే దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లీనరీకి, వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈనెల 27న జరిగే నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాల్లోపు ప్లీనరీ, బహిరంగసభ కార్యాచరణ కోసం గ్రామ, మండలస్థాయి కార్యకర్తల సమావేశాలను నిర్వహించాలని కోరారు. బహిరంగసభకు ప్రతి గ్రామ కమిటీ నుంచి కచ్చితంగా సభ్యులు హాజరయ్యేలా చూడాలన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా ముందుకుపోతున్నదని వివరించారు. త్వరలో మరింత పెద్దఎత్తున పార్టీ వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ త్వరలో చేస్తారని చెప్పారు. వచ్చేనెల 15న బహిరంగసభ తర్వాత పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలుంటాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన ప్రజా నాయకుడు కేసీఆర్ అని వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సెక్రెటరీ జనరల్ కె కేశవరావు, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజరు, పి సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.