Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుజూరాబాద్‌లో అదుపుతప్పిన ఎన్నికల కమిషన్ :కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జీ మాణికం ఠాగూర్
నవతెలంగాణ - హుజూరాబాద్
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపైన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు.. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్త్తీగా.. టీఆర్ఎస్, బీజేపీలు వ్యవహరిస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణికం ఠాగూర్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని వెంకట సాయి గార్డెన్లో నిర్వహించిన కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశానికి మాణికం ఠాగూర్ హాజరయ్యారు. దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీజేపీ, టీఆర్ఎస్లకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని దోచుకొని కార్పొరేట్లకు కట్టబెడుతుంటే, తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకోని రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ హుజూరాబాద్ ఉప ఎన్నికపై అదుపు తప్పిందన్నారు. విచ్ఛలవిడిగా మద్యం డబ్బులు పంచుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందన్నారు. హుజురాబాద్ టికెట్ కోసం 17 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ అందరినీ సమన్వయం చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గళాన్ని అసెంబ్లీలో వినిపించేందుకే యువకుడైన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌కు టికెట్ కేటాయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా నేడు తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతోందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, యూత్ నాయకులు రాజీవ్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, ఎర్ర శ్రీనివాస్, అప్సర్ పాల్గొన్నారు.