Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమానయానశాఖకు కేటీఆర్ లేఖ
నవతెలంగాణ-వరంగల్
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించి 20 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో వరంగల్ మామునూరులో నవంబర్ 15న నిర్వహించనున్న 'విజయగర్జన' బహిరంగసభను నిర్వహించడానికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. మామునూరు విమానాశ్రయం స్థలంలో సభాస్థలి వున్న క్రమంలో ఇక్కడ బహిరంగసభ నిర్వహించాలంటే కేంద్ర విమానయాన శాఖ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ బి. గోపి, వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మామునూరు విమానాశ్రయం సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్ర విమానయాన శాఖ మంత్రితో చర్చించి అనుమతి తీసుకునే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రం అనుమతిని నిరాకరిస్తే ప్రత్యామ్నాయంగా మరో స్థలాన్ని గుర్తించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం హైదారాబాద్ తెలంగాణ భవన్లో 'విజయగర్జన' బహిరంగసభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు.
ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషణ..
'విజయగర్జన' బహిరంగసభ నిర్వహణకు కేంద్ర విమానయాన శాఖ అనుమతి నిరాకరిస్తే ప్రత్యామ్నాయ స్థలం ఏది? అనే విషయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. గతంలో టిఆర్ఎస్ బహిరంగసభలను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ప్రకాశ్‌రెడ్డిపేట, ఓ సిటీ ప్రాంతాల్లో నిర్వహించింది. తాజాగా నిర్వహిం చనున్న 'విజయగర్జన'కు 10 లక్షల మందిని సమీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు భారీ బహిరంగసభకు అవసరమైన మైదాన ప్రాంతాన్ని అన్వేషించే పనిలో టీఆర్ఎస్ నేతలు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద మొత్తంలో సాగు జరుగుతుండడంతో మామునూరు లాంటి మైదాన ప్రాంతం లేదు. ఈ క్రమంలో అంత విశాలంగా వుండే ప్రాంతం కోసం నేతలు వెతుకుతున్నారు.
ప్రత్యామ్నాయంగా మెగా టెక్స్టైల్స్ పార్క్ స్థలం ..?
వరంగల్ నగరానికి తూర్పు వైపున ప్రతిపాదిత మెగా టెక్స్టైల్స్ పార్క్ స్థలం వుంది. 1,200 ఎకరాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మెగా టెక్స్టైల్స్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ క్రమంలో మామునూరుకు ప్రత్యామ్నాయంగా అంత విశాలంగా వుండే స్థలమంటే ప్రతిపాదిత మెగాటెక్స్‌టైల్స్ పార్క్ స్థలమే అనుకూలమని నేతలు భావిస్తున్నారు. ఈ స్థలానికి రెండు, మూడు వైపుల నుంచి లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి రహదారులుండడంతో ట్రాఫిక్ రద్దీ తలెత్తే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఏదేమైనా ఒకట్రెండు రోజుల్లో మామునూరు విమానాశ్రయం స్థలం ఖాయమవుతుందా ? లేక ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఖరారావుతుందా ? అనేది తేలే అవకాశముంది.