Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి
నవతెలంగాణ-జనగామ
రైతు కన్నీరు పెట్టడం దేశానికి అంతగా మంచిది కాదని సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. సోమవారం జనగామ జిల్లాలోని గబ్బెట గోపాల్‌రెడ్డి భవన్లో సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ నారాయణమూర్తి మాట్లాడారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల ఫలితంగా రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులు కన్నీరు పెట్టడం మంచిది కాదన్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను అమ్ముకోవడానికి వెళితే మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నార న్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకుని ఆదరించే ప్రభుత్వాలే నూతన చట్టాలతో వారి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వెంటనే రైతు చట్టాలను విద్యుతు చట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంక్షేమానికి దర్శకత్వంలో నిర్వహించిన రైతన్న సినిమా ఈ నెల 28న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను కార్మిక కుటుంబాలు ఆదరించి ఆశీర్వదిం చాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు మోకు కనుకారెడ్డి, సీహెచ్ రాజారెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు ఇర్రి అహల్య, సత్యం, రమేష్, యాదగిరి, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.