Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుడు ర్యాంకులతో మోసం చేస్తున్న శ్రీచైతన్య, నారాయణ : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రథమ ర్యాంకు తమదంటే, తమదే అని ప్రచారం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై క్రిమినల్, చీటింగ్ కేసు పెట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తప్పుడు ర్యాంకులతో శ్రీచైతన్య, నారాయణ, ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని విమర్శించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్లో ప్రథమ ర్యాంకు పొందిన మృదుల్ అగర్వాల్ తమ కాలేజీలో చదివారంటే, తమ కాలేజీలో చదివారని శ్రీచైతన్య, నారాయణ, ఆకాష్, ఫిట్జీ, ఆల్లెన్, జీ వంటి విద్యాసంస్థలు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఆ విద్యార్థి తమ ప్రోగ్రాం చదివారనీ, ఆన్లైన్ సేవలు వినియోగించుకున్నారని రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ తప్పుడు ర్యాంకులపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జోక్యం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తప్పుడు పద్ధతిలో సంస్థలను ఏర్పాటు చేసి లక్షల రూపాయల ఫీజును దండుకుంటున్న శ్రీచైతన్య, నారాయణ, ఫిట్జీ, ఆకాష్, జీ వంటి విద్యాసంస్థలను నిషేధించాలని కోరారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పించొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.