Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు అనుసరించాల్సి వ్యూహంపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం పోలీస్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటివి పటిష్టంగా అమలు జరుగుతున్నా, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. హౌంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హౌంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు, ఐజిలు, డిఐజిలు సహా అన్ని కేటగిరిల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.