Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్, తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు
- ఇష్టాగోష్టిలో రేవంత్ వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. వాటి నుంచి బయటపడేందుకు అనేక ఎత్తులు వేస్తున్నారని విమర్శించారు. ఎవరడిగారని ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చారని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. గుజరాత్ ఎన్నికలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఒకేసారి ఎన్నికలు వస్తాయని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వివరించారు. మోడీ డైరెక్షన్లో కేసీఆర్ నడుస్తున్నారనీ, తద్వారా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సోమవారం హైదరాబాద్లోని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) కార్యాలయంలో రేవంత్ విలేకర్లతో ఇష్టాగోష్టిలో విలేకర్లతో మాట్లాడారు. పార్టీలో తిరుగుబాటును అడ్డుకునేందుకే వరంగల్లో టీఆర్ఎస్ విజయగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నదని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చాలా మార్పులోస్తాయనీ, ఆ పార్టీలో తిరుగుబాటు తప్పదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవన్న అంశాలను రేవంత్ ప్రస్తావించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే ఉన్నారనీ, అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకారం ఉంటుందనీ, ఇందుకు సంబంధించి అంతర్గత ఒప్పందం జరిగిందన్నారు. కేసీఆర్పై కేసులు, సీబీఐ దాడులు జరగకుండా చూడడం ఆ ఒప్పందంలో భాగమేనని చెప్పారు. గుజరాత్ ఎన్నికల సమయానికి తెలంగాణ సర్కారును సర్కార్ను కేసీఆర్ రద్దు చేస్తారని చెప్పారు. సర్కారును నడపాల్సిన సమయంలో పార్టీపై కేసీఆర్ దృష్టి పెట్టడమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమేనన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావనీ, ఆరు నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని వివరించారు.