Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
- లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నా గురువు చుక్కా రామయ్య. నాకు ఫిజిక్స్ బోధించారు. నా జీవితాన్ని పరివర్తన చేసిన ఉపాధ్యాయులు చుక్కా రామయ్య, శేషాచార్యులు'అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ అబ్దుల్ కలాం సామాన్య పేద కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని చెప్పారు. ఆయన దార్శనికుడు, తత్వవేత్త అని అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సంకల్పించారని గుర్తు చేశారు. విజన్-2020 పుస్తకంలో విద్యావైద్యం, ఉపాధి, వ్యవసాయం వంటి అనేక విషయాలను పొందుపరిచారని వివరించారు. ఉపాధ్యాయులను సన్మానించడమంటే దేశాన్ని సన్మానించడమని అన్నారు. జాతి నిర్మాణానికి టీచర్లే కీలకమని వివరించారు. పేదరిక నిర్మూలన జరగాలంటే అందరికీ విద్య అందించాలని సూచించారు. నైతిక విలువలతో కూడిన శాస్త్రీయమైన, నాణ్యమైన విద్య అందించాలని కోరారు. అధ్యక్షత వహించిన లీడ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మెన్ ఎన్బి సుదర్శన్ ఆచార్య మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల్లోని టీచర్లకు ఏటా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందించాలని సూచించారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ సమాజం విలువలతో ముందుకెళ్లాలంటే ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. మానవ విలువలను పెంచాలన్నారు. ఈ కార్యక్ర మంలో పసావా జాతీయ అధ్యక్షులు సయ్యద్ షామిల్ అహ్మద్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మెన్ గున్న రాజేందర్‌రెడ్డి, లీడ్ ఇండియా ఫౌండేషన్ ట్రస్టీలు సిహెచ్ రవీంద్రనాథ్, కె ప్రభాకర్‌రావు, టి లక్ష్మిప్రసన్న, మేజర్ కె మధుకర్, ట్రస్మా నాయకులు సి రాంచందర్, కె అనిల్‌కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, బి రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు.