Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఐటీయూ అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాలు వచ్చేనెల 16,17,18 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన లోగోను ఆ సంఘం అఖిల భారత అధ్యక్షురాలు కె హేమలత సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ఆర్థిక స్వావలంబనకు, సార్వభౌమత్వానికి ప్రమాదం తెచ్చే విధానాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ కష్టకాలంలో ఆర్థిక సమస్యలకు తోడు ఆరోగ్య సంక్షోభం కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నదని చెప్పారు. ఈ సంక్లిష్ట రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో ఈ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్య ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఈ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్రాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు విశాల కార్మికోద్యమాల వారధిగా పనిచేస్తున్న సీఐటీయూ జనరల్ కౌన్సిల్ సమావేశాలను రాష్ట్రంలో విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు కోరారు. వాణిజ్య, వ్యాపార ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభ్యుదయ మేధావులు, కార్మికవర్గం ఆర్థిక, హార్ధిక తోడ్పాటునందించాలని సూచించారు.