Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎలాంటి బొగ్గు నిల్వల కొరత లేదని సింగరేణి సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో తగినన్ని నిల్వలు ఉండేలా ప్రతీరోజు బొగ్గు రవాణా చేస్తున్నామని చెప్పారు. సోమవారం నాడాయన హైద్రాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి సంస్థ డైరెక్టర్లు, 11 ఏరియాల జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి పెంపుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణితో బొగ్గు సరఫరా ఒప్పందం ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా తగినంత బొగ్గును అందిస్తున్నామనీ, రానున్న కాలంలో దీన్ని మరింత పెంచుతామని స్పష్టం చేశారు. ఇక నుంచి రోజుకి లక్షా 90 వేల టన్నుల బొగ్గు రవాణా చేపట్టాలనీ, నవంబర్ నుంచి రోజుకి 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నట్టు తెలిపారు. సంక్షోభ సమయంలో సమర్ధవంతంగా పనిచేస్తూ, జాతీయ స్థాయిలో సింగరేణి ప్రతిభను చాటాలని చెప్పారు. దేశంలో, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలలో తగినన్ని బొగ్గు నిల్వలు లేనందున కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాలని కోరుతున్నదని వివరించారు. దీనికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు వెంటనే ఇస్తామన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, డి సత్యనారాయణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్‌మూమెంట్) జె ఆల్విన్, అడ్వయిజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్, జనరల్ మేనేజర్లు కే సూర్యనారాయణ, కె రవిశంకర్, సురేందర్ సహా అన్ని ఏరియాల అధికారులు పాల్గొన్నారు.