Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హూజూరాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాతపూర్వక ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ప్రధానాధికారికి పంపింది. దళితబంధు పేరుతో ఓటర్లకు నేరుగా నగదు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వివరించారు. దీనిపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిస్థాయి నివేదికను వెల్లడిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దళితబంధు పథకం కింద అర్హులైన దళితులకు రూ.10 లక్షలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారా అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీంను పైలట్ ప్రాజెక్ట్ పేరుతో హుజూరాబాద్, వాసాలమర్రిలో అర్హులైన వారికి ఇస్తూ నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియకు ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ స్కీం ద్వారా నేరుగా ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ఫిర్యాదులు అందండంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా కూడా ప్రభుత్వం వరదసాయం పేరుతో ముంపుకు గురైన ప్రజలకు రూ.10వేలు చొప్పున నగదు ఇచ్చేందుకు ముందుకు వచ్చి, కొందరికి ఆ మేరకు డబ్బు పంపిణీ చేసింది. ఇక్కడ కూడా ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని, దాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసాక ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తకపోవడం గమనార్హం.