Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు అంతే మంది ఐసీయూల్లో జనరల్ వార్డుల్లో వేగంగా తగ్గుతున్న రోగులు పూర్తిగా తొలగిపోని కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. దాదాపు కనుమరుగైనట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఆస్పత్రుల్లో కోవిడ్-19కు చికిత్స పొందుతున్న రోగుల్లో ఎక్కువ మంది ఆక్సిజన్ బెడ్లపైనే ఉన్నారు. ఆ తర్వాత అధికంగా ఐసీయూ వార్డుల్లో ఉన్నారు. ఇక స్వల్పలక్షణాలు, లక్షణాలు లేకుండా జనరల్ వార్డుల్లో చేరే వారి సంఖ్య మాత్రం వేగంగా తగ్గుతుండటం గమనార్హం. కరోనా రోగుల కోసం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 55,442 ప్రత్యేక పడకలను కేటాయించారు. వీటిలో 53,725 (96.90 శాతం) బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక 1717 (3.10 శాతం) బెడ్లలో రోగులు చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య తక్కువ ఉంటున్నప్పటికీ అందులోనూ సీరియస్ రోగులు వందల సంఖ్యలో ఉండటంతో మరికొంత కాలంపాటు ఓపికతో జాగ్రత్తలు కొనసాగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కలిపి రోగులు మొత్తం 1717కు పరిమితం కాగా అందులో అధికంగా 682 మంది (40 శాతం) మంది ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైన వారే ఉన్నారు. మరో 648 మంది (38 శాతం) మంది ఐసీయూలో ఉన్నారు. అతి తక్కువగా 387 మంది (22 శాతం) జనరల్ వార్డుల్లో ఉన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 14,776 పడకలుండగా అందులో 563 (3.8 శాతం) మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. ఇందులోనూ ఆక్సిజన్ వార్డులో 246, ఐసీయూలో 232, జనరల్ వార్డులో కేవలం 85 మంది ఉన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ ఇదే తరహాలో 436 మంది ఆక్సిజన్ పడకల్లో, 416 మంది ఐసీయూలో, 302 మంది మాత్రం జనరల్ వార్డుల్లో ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గటం, అదే క్రమంలో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పడిపోవటం ఊరటనిస్తున్నా ఆ చేరుతున్న వారిలో ఎక్కువ మందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతున్నదని వైద్యులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్, యాంటీబాడీలు పెరగటం తదితర కారణాలతో ప్రజలు తిరిగి సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నారనీ, అయితే పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి వచ్చేంత వరకు అప్రమత్తంగా ఉండటం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.