Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీని ఇంటికి పంపడం ఖాయం
- అఖిల భారత కిసన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్
నవతెలంగాణ-కొత్తగూడెం
రైతాంగ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, కేంద్రం కుట్రలు పన్నుతున్నదని, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు అయ్యే వరకు రైతాంగ పోరాటం ఆగదని, హింసతో రైతు ఉద్యమాన్ని అణచివేసే మోడీని ఇంటికి పంపడం ఖాయమని అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 'భారత వ్యవసాయ రంగం-ప్రస్తుత సవాళ్ళు' అనే అంశంపై సోమవారం సెమినార్ నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం క్లబ్లో సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచిలి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సెమినార్లో ముఖ్య అతిధిగా అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజూ కృష్ణన్ ప్రసంగిస్తూ ఐక్య పోరాటాలతో రైతు వ్యతిరేక చట్టాలను తిప్పి కొడతామని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలతో పాటు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జోడించి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని రైతు నేతలకు విజూ సూచించారు. ఏడాదిగా శాంతి యుతంగా సాగుతున్న పోరాటాన్ని హింసాత్మకంగా మార్చేందుకు కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు.
అయినప్పటికీ పాలక పక్షానికి బేదిరేది లేదని అయన స్పష్టం చేశారు. రైతాంగ ఉద్యమం ఢిల్లీకి పరిమితమైంది కాదనీ, ఇది దేశవ్యాప్తమైనదని చెప్పారు. కేరళ మాదిరిగా ప్రత్యామ్నాయం వైపు పయనించాలి, ప్రత్యామ్నాయ పంటల కోసం 19రకాల పండ్లు, కూరగాయలకు ధరలు నిర్ణయించి కేరళ వామపక్ష ప్రభుత్వం రైతులను ప్రోత్సహించిందని వివరించారు. అదే తరహాలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలని సూచించారు. తాము ప్రత్యామ్నాయ పంటలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో కంది పంట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తే రైతులు పండించారనీ, కాని ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. దీంతో రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకం పోయిందని గుర్తు చేశారు. ఏకపక్షంగా విత్తనాల సరఫరాను ఆపటం సమస్యకు పరిష్కారం కాదని హితవు పలికారు. ప్రభుత్వం పంటల నష్టం అంచనా వేయలేదనీ, తద్వారా కేంద్ర ప్రణాళికా సంఘం నుంచి వచ్చిన నిధులకు, మ్యాచింగ్ నిధులు కలిపి రైతులను ఆదుకునే అవకాశం లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ, రుణ ప్రణాళిక లేదనీ, సీఎం కేసీఆర్ నోటికి ఏది తోస్తే అదే ప్రణాళికలా అమలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఉన్న ప్రణాళికే తప్ప భూసార పరీక్షలు చేయలేదని, ఏభూమిలో ఏపంట పండుతుందో కూడా తెలియదన్నారు. రాష్ట్రంలో 40 లక్షల టన్నుల కూరగాయల వినియోగం ఉంటే 30 లక్షల టన్నుల పంటే వస్తుందని, నూనెలు గింజలు, పప్పులు తదితరాలన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగికి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. రైతుల చైతన్యంతోనే పాలకులు భయపడతారని, ప్రజ వ్యతిరేక విధానాలను విడనాడుతారని ఒకవైపు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తెస్తూ, మరోవైపు విద్యుత్ ఛార్జీలను ఇష్టానుసారంగా కార్పొరేట్లకు అనుమతిలిస్తూ, ఇంకోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజల్లో బీజేపీ విధానాల పట్ల అసంతృప్తి పెరిగిందని, ఇక బీజేపీ పతనమే మిగిలిందన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పతనం ప్రారంభమవుతుందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని పిలుపు నిచ్చారు. ఈ సెమినార్లో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి కున్సోత్ ధర్మ, అన్నవరపు సత్యనారాయణ, బాణోత్ కుమారి, ఊకంటి రవికుమార్, కొండబోయిన వెంకటేశ్వర్లు, వాంకుడోత్ కోబల్, ధర్మ, శంకర్, లక్ష్మినారాయణ, సాంబశివరావు, సర్గం బాలనర్సయ్య, మోహన్రావు, బిబిజి తిలక్, కాట్రాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.