Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోతయంత్రాల యజమానులకు వీడీసీ హుకుం
- వీడీసీతో పాటు సర్పంచ్ భర్తపై కేసు
నవతెలంగాణ-ధర్పల్లి
తమ మాట వినట్లేదని, కమిటీ నుంచి బహిష్కరించినా దళితులు పట్టించుకోకపోవడంతో వీడీసీ దుశ్చర్యకు పాల్ప డింది. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో దళితుల పంటలు కోయొద్దని కోత మిషిన్ యజమానులకు హుకుం జారీ చేసింది. దీంతో పక్క పొలాలను కోస్తున్నా.. తమ పొలాలకు రాకపోవడంపై దళితులు ఆరా తీయగా వీడీసీ కుట్ర బయటపడింది. దీంతో దళితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వీడీసీ సభ్యులతో పాటు సర్పం చ్ భర్తపై కేసు నమోదు అయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టులో ఆలస్యం గా వెలుగుజూసింది. రామడుగు ప్రాజెక్టు గ్రామంలో 65 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరి జనాభా సుమారు 250 మంది. వారి కులస్తులు శుభకార్యాలు జరుపుకోవడం కోసం ఓ మండపం నిర్మించుకునేందుకు గ్రామంలో తమ తాతల నాటి పెంటకుప్పల స్థలాన్ని చదును చేశారు. దీంతో వీడీసీ సభ్యులు అడ్డుపడి.. ఆ స్థలం గ్రామ అవసరాలకు వీడీసీకి అప్పగించాలని ఆదేశించారు. తమ స్థలంలో కల్యాణమండపం నిర్మించుకుంటామని తేల్చిచెప్పారు. ఆ స్థలం ఇస్తేనే వీడీసీలోకి దళితులను రానిస్తామని, అంత వరకు రానివ్వబోమని మెలిక పెట్టారు. స్థలం ఇచ్చేది లేదని, వీడీసీకి వెళ్లబోమని దళితులు స్పష్టం చేశారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న వీడీసీ.. గ్రామంలో డప్పు కొట్టేందుకు దళితులను పిలవొద్దని వీడీసీ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఎంత చేసినా తమ దారికి రావట్లేదని భావించిన వీడీసీ.. వారి పొట్టకొట్టేందుకు సైతం సిద్ధపడింది. ప్రస్తుతం వరి కోతకు రాగా.. దళితుల పంటలు కొయొద్దని వరి కోత యంత్రాల యజమానులకు హుకుం జారీ చేసింది. గ్రామంలో వారం క్రితం కోతలు మొదలవ్వగా దళితుల పొలాలు కోసేందుకు ఎవ్వరు ముందుకు రావడంలేదు. వీరి పొలం గట్టుకు పక్కనే ఉన్న ఇతరుల పొలాలు కోసి పోతున్నా తమ పొలం మాత్రం కోయడం లేదు. పిలిచినా రేపు వస్తాం.. మళ్లొస్తాం అంటూ దాటవేస్తున్నారు. అనుమానం వచ్చిన దళితులు.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీశైలం వీడీసీ సభ్యులతో చర్చించినా వినకపోవడంతో వీడీసీ సభ్యులతో పాటు సర్పంచ్ భర్తపై కేసు నమోదు చేశారు.