Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.కోట్ల విలువ గల భూములు స్వాహా
- వివాదంలో లక్షా 52 వేల 311 ఎకరాల భూములు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
- రియల్టర్లకు కొమ్ముకాస్తున్న వైనం
రాష్ట్ర రాజధాని శివారు ప్రాంతమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములకు డిమాండ్ ఉండటంతో.. సర్కారు భూములపై బడాబాబుల కన్ను పడింది. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా పెట్టేస్తున్నారు. సెంటు భూమి కూడా అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పాలకులు ప్రగల్భాలు పలకడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. కోట్ల రూపాయల విలువ గల భూములు కబ్జాకు గురవుతున్నప్పటికీ ఇటు ప్రజా ప్రతినిధులు, ఆటు అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తిన్నట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలోని 612 గ్రామాల్లో 10లక్షలా 67వేల181 సర్వే నంబర్లను పరిశీలించగా 9లక్షలా 74వేల335 సర్వే నంబర్లు క్లియర్‌గా ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సుమారు 92 వేల సర్వే నెంబర్లలో సమస్యలు పరిష్కరించాలని అధికారులు చెబుతున్నారు. 13లక్షలా19వేల381 ఎకరాలు తనిఖీ చేయగా, 11 లక్షలా 67 వేల70 ఎకరాలు వివాద రహిత భూమిగా గుర్తించారు. మరో లక్షా 52 వేల 311 ఎకరాల భూములు అక్రమణకు గురైన.. వివిధ సమస్యలతో వివాదంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 26 మండలాల పరిధిలోని 321 గ్రామాల్లో 6,47,108 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్టు గుర్తించగా 5,440 మందికి 6,198.11 ఎకరాలు అసైన్డ్ చేశారు. 605 గ్రామాల్లో 80,030 సర్వే నంబర్లలో వ్యవసాయేతర భూములు ఉన్నాయి. ఇందులో 1,64,989 ఎకరాల ప్రభుత్వ భూమి కాగా, 90,911 ఎకరాలు పట్టా భూములు ఉన్నట్టు రెవెన్యూ అధికారులు వివరించారు.
అక్రమణకు గురైన ప్రభుత్వ భూములు
శంషాబాద్‌లోని రషీగూడ సర్వే నంబర్ 78/8లోని రెండు ఎకరాల అసైన్డ్ భూమి ప్రభుత్వం పేదలకు కేటాయించింది. దీన్ని సదరు రైతు రియల్ ఎస్టేట్ వ్యాపారికి విక్రయించాడు. ఈ భూములు అమ్మడం, కొనడం నేరమని తెలిసినా రియల్ వ్యాపారి వెంచర్ వేశారు. ఈ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టగా ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. శంకర్పల్లి మండలం జన్వాడలోని సర్వే నంబర్ 283లో 14.38 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైంది. శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని తీగలవాగును కొంత మంది రియల్ట్ర్లు కబ్జా చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బండ రావిరాలలోని సర్వే నంబర్ 293లో 563.13 గుంటల భూమి ఉండగా, 1955, 1958 సీసాల పహాణీ ఆధారంగా ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చారు. ప్రస్తుతం 153.18 గుంటల భూమి మాత్రమే మిగిలింది. భూమికి సంబంధించిన రికార్డులు కూడా మాయం అయ్యాయి. ఈ భూమిని రీ సర్వే చేసి, ప్రభుత్వ భూమి లెక్క తేల్చాల్సిందిగా ప్రజాసంఘాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చేవెళ్ల మండలం గుండాల పంచాయతీ సర్వే నంబర్ 144లో 5.10 ఎకరాల భూమిలో పోచమ్మ కుంట ఉంది. రియల్టర్లు ఇటీవల దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
ప్రభుత్వ భూములను కాపాడాలి
జిల్లాలో వేల ఎకరాలు అక్రమణకు గురవుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు, పాలక వర్గాలు నిరక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. ప్రభుత్వ భూమి సెంట్ కూడా అక్రమణకు గురికాకుండా కాపాడుతామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. భూములను కాపాడటంలో విఫలమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి సర్కారు భూములను కాపాడేందుకు చర్యలు పెట్టాలి.
- దుబ్బాక రాంచదర్, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం
ప్రభుత్వ భూములు అక్రమణకు గురవుతున్న విషయం తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. తహసీల్దార్లకు ఫిర్యాదు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో సందర్శించి, కబ్జాలను అడ్డుకుంటున్నాం. ఇప్పటికే రాయదుర్గం సర్వే నంబర్ 44లోని భూమికి ఫెన్సింగ్ వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. మిగిలిన భూములకు కూడా ఫెన్సింగ్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
- తిరుపతిరావు, అదనపు కలెక్టర్, రెవెన్యూ