Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా చేయాల్సింది చాలా ఉంది...
- బంగారు వాసం తేలే.. ప్రజల్లో ధైర్యాన్ని నింపాం...
- దళిత బంధు కార్యక్రమం కాదు.. అది ఒక యజ్ఞం...
- ఆరునూరైనా అమలు చేసి తీరతాం
- ఆ పథకం తరహాలోనే ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు, అగ్రవర్ణ పేదలకూ పథకాలు
- ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు
- గులాబీ తీర్థం పుచ్చుకున్న మోత్కుపల్లి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సాధించగానే కథ అయిపోలేదనీ, తమ ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. 'స్వరాష్ట్రంతోనే బంగారు వాసం తేలే... కానీ ప్రజల్లో ధైర్యాన్ని నింపగలిగాం...' అని ఆయన అన్నారు. అంతరాలు, అసమానతలు లేని సమాజమే తమ ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ క్రమంలోనే అట్టడుగున ఉన్న ఎస్సీల కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ఈ పథకాన్ని ఎంత బాగా విజయవంతం చేస్తే అంత బాగా ఇతర వర్గాలకూ న్యాయం జరుగుతుందని వివరించారు. దళిత బంధు తరహాలోనే మున్ముందు రాష్ట్రంలోని గిరిజనులు, బీసీలు, ఓబీసీలు, అగ్రవర్ణ పేదలకూ పథకాలను ప్రవేశపెడతామని సీఎం వెల్లడించారు.
మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సోమవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్... స్వయంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ... 'రాష్ట్రంలో అన్ని కులాలకంటే దళితులు వెనుకబడి ఉన్నారు, తెలంగాణలో ఎస్సీలు 70లక్షల మంది ఉంటే, వారి చేతిలో 13 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది, గిరిజనులు జనాభాలో 9 శాతంగానే ఉన్నారు, కానీ వారి చేతిలో 22 లక్షల ఎకరాల భూమి ఉంది...' అని చెప్పారు. అందుకే ప్రాధాన్యతా క్రమంలో దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇతర పార్టీలకు రాజకీయాలంటే ఒక క్రీడ... కానీ టీఆర్ఎస్కు మాత్రం ఒక టాస్క్ అని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సంపద పెరిగితే అది తప్పనిసరిగా పేదలకు పంచాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంత ధైర్యంతో ముందుకు సాగామో.. అంతకన్న ఎక్కువ దైర్యంతో... ప్రాణం పోయినా సరే దళితబంధును వదలబోమని వెల్లడించారు. ఈ పథకానికి రూ.లక్షా 70వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఇంత మేర నిధులు కేటాయింంచటానికి దమ్ము.. ధైర్యం ఉండాలని అన్నారు. ఇదే ధైర్యంతో దళిత బంధును విజయవంతం చేస్తామన్నారు. ఈ పథకం కింద అందజేసే రూ.లక్షా 70వేల కోట్లతో 10లక్షల కోట్ల సంపద తిరిగి లభిస్తుందని వివరించారు.
తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కొందరు మిత్రులు తనను ప్రాణహాని ఉందంటూ హెచ్చరించారని తెలిపారు. అయినా తాను భయపడలేదని వివరించారు. తెలంగాణ కోసం 32 జాతీయ పార్టీలను ఒప్పించి రాష్ట్రం సాధించామన్నారు. ఒక్క మాయావతినే తెలంగాణ కోసం 19 సార్లు కలిశానని తెలిపారు. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో ఎంతో మార్పు కనిపిస్తున్నదని వివరించారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి...ఒకసారి గెలవొచ్చు, మరోసారి ఓడిపోవచ్చు... అలాంటి వాటితో రాష్ట్రాభివృద్ధి ఆగబోదని స్పష్టం చేశారు. 'తెలంగాణ రాష్ట్రం తెచ్చినంక నేను పక్కకు జరుగుదామనుకున్న...అయితే కొత్త రాష్ట్రం ఎవరి చేతిలోనో పెడితే ఎలా ఉంటుందో అనే ఆందోళనను కొందరు వ్యక్తం చేయడంతో నేను పగ్గాలు చేపట్టా...' అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దళిత బంధు గొప్ప తనం గురించి వివరించాలని సూచించారు.
మోత్కుపల్లితో చిరకాల బంధం...
మోత్కుపల్లితో తనకు చిరకాల అనుబంధం ఉందని సీఎం చెప్పారు. విద్యార్థి దశ నుంచే ఆయన క్రీయాశీలక రాజకీయాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఆయన అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని తపించే వ్యక్తి నాకు అత్యంత సన్నిహితుడు అని కేసీఆర్ చెప్పారు. కరెంటు మంత్రిగా పని చేసిన మోత్కుపల్లికి తెలంగాణ కరెంటు కష్టాల గురించి తెలుసునని అన్నారు. నర్సింహులు టీఆర్ఎస్లో చేరటాన్ని రాజకీయంగా చూడొద్దని కోరారు. ఆయన సేవలను ఎప్పుడెప్పుడు, ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటామని చెప్పారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ లింగయ్య యాదవ్, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.