Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందే...: ఏఐకేఎస్‌సీసీ డిమాండ్
- కాచిగూడ రైల్వేస్టేషన్ గేటు వద్ద ధర్నా, అరెస్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లఖీంపూర్ ఖేరి హింసాకాండకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఏఐకేఎస్‌సీసీ నేతలు డిమాండ్ చేశారు.ఈ డిమాండ్‌పై దేశ వ్యాప్తంగా రైల్‌రోకో, ధర్నాలకు ఏఐకేఎస్‌సీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేసేష్టన్ గేటు వద్ద రైతునేతలు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైటాయించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదాలు, తోపులాట జరిగింది. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర నాయకులు పశ్యపద్మ, మూడ్‌శోభన్, చలపతిరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన ప్రధాని మోడీ 21వ శతాబ్దపు నిరంకుశుడని విమర్శించారు. మూడు సాగు చట్టాలు రద్దు చేయాలనీ, లఖింపూర్ ఖేరీ హింసాకాండపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా క్యాబినెట్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయంపై ఆధాపడిన వారి జీవనోపాధిపై అమానవీయ దాడి చేస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని ప్రయి వేటుపరం చేసి దేశంలోని కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం నేడు వారిని పేదలుగా మార్చడానికి ఈ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన 'ఫండ్ దాతల' కోసం మన 'అన్న దాతలను' కీలుబొమ్మలుగా మారుస్తున్నదని విమర్శించారు.కేంద్ర సర్కారు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లోమనదేశం 101వ స్థానానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, కార్మిక సంఘాలకు చెందిన నాయకులు కలకొండ కాంతయ్య, ఎస్ఎల్ పద్మ, అనురాధ, పివోడబ్ల్యూ బి ఝాన్సీ, కొండా రెడ్డి, వి అరుణ, భవాని, పరుశురామ్, అన్వేష్, అరుణ, శివ బాబు తదితరులు పాల్గొన్నారు.