Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన్ని తక్షణం బర్తరఫ్ చేయాలి
- సీఐటీయూ అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లఖింపూర్ ఘటనకు బాధ్యులైన కేంద్ర హౌంశాఖ సహాయం మంత్రి అజరు మిశ్రాకు బీజేపీ కొమ్ముకాస్తున్నదనీ, ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని సీఐటీయూ అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత డిమాండ్ చేశారు. ఈ అంశంలో కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ లఖింపూర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై సదరు మంత్రి కుమారుడు కారుతో ఢ కొట్టడంతో నలుగురు రైతులు మరణించారని తెలిపారు. ఘటన జరిగి 20 రోజులు కావస్తున్నా ప్రధానమంత్రి మౌనం వీడకపోవటం అన్యాయమని విమర్శించారు. ఈ అమానుష ఘటనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయనీ, అంతర్జాతీయంగా సంఘీభావం వ్యక్తమవుతున్నప్పటికీ మంత్రిని తొలగించకుండా బీజేపీ కొమ్ముకాస్తున్నదని విమర్శించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, ఎం.సాయిబాబు, ఆఫీస్ బేరర్లు ఎస్.వీరయ్య, పాలడుగు భాస్కర్, భూపాల్, ఎస్.రమ, జె.వెంకటేష్, వంగూరు రాములు, వి.ఎస్.రావు, కోటం రాజు, ఎం.వెంకటేష్, పద్మశ్రీ, జె.మల్లికార్జున్, కళ్యాణం వెంకటేశ్వరరావు, జె.చంద్రశేఖర్, బి.మల్లేష్, టి.వీరారెడ్డి, ముత్యంరావు, నాయకులు కూరపాటి రమేష్, పి.సుధాకర్, వై.సోమన్న తదితరులు పాల్గొన్నారు.