Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జోక్యం చేసుకోవాలి: తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి- (టీఐపీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సమితి కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తు కోసమా? లేక బోర్డులో అక్రమ డిప్యూటేషన్లు, ఓడిలు, ఓఎస్డీలను కొనసాగిస్తూ అవినీతి పరులను కాపాడటానికా? అని ప్రశ్నించారు. 2020-21లో కనీసం 20 రోజులు కూడా ప్రత్యక్ష తరగతులు జరగలేదనీ, 40 శాతం సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలిపారు. ఇది వరకే ప్రభుత్వం విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. అది కాదని సాంకేతిక కారణాన్ని చూపిస్తూ పరీక్షలు నిర్వహించటం అవసరమా అని ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులతో గురుకుల హాస్టళ్ల, కళాశాలలు ఇప్పటికీ ప్రారంభం కాలేదనీ, ప్రత్యక్ష తరగతులు నిర్వహించటం లేదనీ, ఈ సమయంలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 1,654 మంది జూనియర్ అధ్యాపకులు పోస్టులు ఖాళీగా ఉంటే సోమవారం కమీషనర్ గెస్ట్ లెక్చరర్లను నియామకానికి ఆదేశాలు ఇచ్చారనీ, ఇప్పటి వరకు విద్యార్థులు ఎలా చదువుకున్నారు? పరీక్షలకు విద్యార్థులు అనివార్య కారణాల వల్ల గైర్హాజరైతే వారిని ఏం చేస్తారు? పరీక్షలు రాసి ఒకవేళ ఫెయిలైతే వారిని ఏం చేస్తారు ? ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఏడాది (2021-22) ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తరగతులు ఎలా నిర్వహిస్తారనే సరైన వివరణ ఇవ్వటం లేదని తెలిపారు.