Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తార్నాక ఆర్టీసీ వైద్యశాలను కార్పొరేట్ ఆస్పత్రికి అప్పగించారన్న వార్తలపై ఆర్టీసీ యాజమాన్యం స్పష్టతనివ్వాలనీ, తద్వారా 69 వేల ఆర్టీసీ కుటుంబాలకు వైద్యంపై భరోసా కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రయివేటీకరిస్తారనీ, కార్మికులకు వీఆర్ఎస్, సీఆర్ఎస్ పథకం ద్వారా ఇంటికి పంపిస్తారనీ, తార్నాక ఆస్పత్రిని కార్పొరేట్ వారికి అప్పగిస్తారనే వార్తలకు బలం చేకూర్చేలా యాజమాన్యం చర్యలున్నాయని విమర్శించారు. ఇవన్నీ కార్మికులను, వారి కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురాకపోతే ప్రయివేటీకరిస్తామని సీఎం చెప్పారంటూ ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. సంస్థ భూములను అమ్మకుండా లీజుకిచ్చి ఆదాయం పెంచుకుంటామని చెబుతూనే టీఎస్ఆర్టీసీని మూసేస్తే రూ.1,000 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసిందనే విషయాన్ని చైర్మెనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారనీ, ఆ లేఖను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. అందులో కోవిడ్ వైద్యం అందించడంతో పాటు 'ట్రామా కేర్'ని ఏర్పాటు చేయాలనీ, ఇన్పేషెంట్ రోగులకు వైద్యం అందించాలని కోరారు. ఆ ఆస్పత్రిలోని రెండు ఫిజియెథెరపీ రూములు, ఫార్మసీలోని ఒక భాగంతో పాటు పలు విభాగాలు కూడా కార్పొరేట్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉన్నాయన్న వార్తల్లో ఎంత వరకు నిజముందో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమంటే ఆస్పత్రిని కార్పొరేట్లకు కట్టబెట్టడమా? అని ప్రశ్నించారు. ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తున్న 49 వేల కుటుంబాలకు, రిటైరై తార్నాక నుంచి వైద్య సదుపాయాలు పొందుతున్న సుమారు 20 వేల కుటుంబాలకు నష్టం చేకూర్చే చర్యలు తీసుకోవద్దని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు.