Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి : ఎన్పీఆర్డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కార్తీక్ గౌడ్ అనే వికలాంగుడి చావుకు కారణమైన యాదగిరిగుట్ట పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలనీ, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఆ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎం. జనార్ధన్‌రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకట్, ఎం. అడివయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. యాదగిరిగుట్ట దైవ దర్శనం కోసం వెళ్లిన కార్తీక్ గౌడ్‌ని బందోబస్తులో ఉన్న పోలీసులు ఆకారణంగా అడ్డుకుని తీవ్రంగా కొట్టడంతోనే చనిపోయాడని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటూనే వికలాంగుడని కూడా చూడకుండా లాఠీతో ఇష్టమొచ్చినట్టు కొట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అతని మరణానికి కారణమైన పోలీసులపై 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 92 (ఏ)(బి) కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుని మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని తెలిపారు.