Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి 10 మంది గిరిజన మహిళల అరెస్ట్
నవతెలంగాణ-మహబూబాబాద్
మానుకోట పోలీసుల దాష్టీకానికి అద్దం పట్టేలా పోలీసులు సోమవారం అర్ధరాత్రి 10 మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేశారు. గిరిజన సామాజికవర్గానికి చెందిన మహిళలుగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సూర్నపు సోమయ్య, సమ్మెట రాజమౌళి, గునిగంటి రాజన్న, బొమ్మన అశోక్ కుమార్, నాయకులు కుర్ర మహేష్, బానోత్ వెంకన్న, హేమానాయక్ ఖండించారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కళాశాల నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు ఎస్పీ కార్యాలయ సమీపంలోని 58 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. సదరు భూముల్లో ఇప్పటికే పట్టణ శివారు సాలార్ తండాకు చెందిన గిరిజనులు అనేక తరాలుగా సాగు చేసుకుంటున్నారు. ఇక్కడే సమస్య మొదలైంది. ఆ భూములు తమవంటూ గిరిజనులు మూడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. కాగా గిరిజనులను బలవంతంగా గెంటేసి రెవెన్యూ అధికారులు ప్రొక్లెయినర్‌తో పనులు చేపట్టారు. దాంతో గిరిజనులు హైకోర్టును ఆశ్రయించారు. సదరు భూమిలోకి రెవెన్యూ అధికారులు అడుగు పెట్టవద్దంటూ ఈనెల 18 అర్ధరాత్రి 12 గంటల వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భూమిలో చేపట్టిన పనుల వద్దకు గిరిజన మహిళలు వెళ్లి కోర్టు ఆదేశాలు చూపి అధికారులను నిలదీశారు. అయినా అధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడంతో గిరిజన మహిళలు ప్రతిఘటించారు. దాంతో పోలీసులు కొందరు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఆగ్రహించిన మరికొందరు మహిళలు నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించారు. దాంతో పోలీసులు వారికి నచ్చజెప్పి కిందకు దింపి బాధితులు ఇండ్లకు వెళ్లాక అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో బానోతు అనసూర్య, బానోతు భారతి, బానోతు పద్మ, మంజుల, బానోతు రంగమ్మ, బానోతు రాధ, బానోతు బుజ్జి, బానోతు కనకమ్మ, మాలోతు మంగ, బానోతు పద్మ ఉన్నారు. మరో 9 మందిపైన పోలీసులు కేసు నమోదు చేశారు.