Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాది 5 లక్షల ఎకరాల్లో సాగు
- మూడేండ్లలో 20లక్షల ఎకరాలు సర్కార్ లక్ష్యం
- 12 లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నాం..
- గెలలు అక్రమ రవాణా నివారణకు చర్యలు
- ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 'తెలంగాణ ఆయిల్ పామ్ మిషన్' పనులు వేగవంతంగా సాగుతున్నాయని ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్ తెలిపారు. రానున్న మూడేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందనీ, వచ్చే ఏడాది 5 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్టు తెలిపారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలోని నర్సరీలో మొక్కల ఉత్పత్తిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల రకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. మొక్కల ఉత్పత్తిలో నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. రైతులకు మొక్కల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయిల్ పామ్ మొక్కల కొరతను నివారించేందుకు నూతనంగా నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామనీ, వచ్చే ఏడాదికి 12 లక్షల మొక్కలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో టీఎస్ ఆయిల్‌ఫెడ్‌కు సాగు విస్తరణకు కొత్తగా 1.15 లక్షల ఎకరాలను ఉద్యాన శాఖ కేటాయించిందని అన్నారు. ఈ ఏడాది 70 వేల ఎకరాల్లో కొత్త ప్లాంటేషన్ కోసం ప్రణాళిక సిద్ధం చేశామనీ, మిగతా 45 వేల ఎకరాలను మరో ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 25 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణపై దృష్టి సారించామనీ, ఇందుకోసం అశ్వారావుపేట, ఖమ్మం పరిసరాల్లో కొత్తగా మరో రెండు నర్సరీలు ఏర్పాటు చేస్తు న్నట్టు తెలిపారు. ఈ ఏడాది మొక్కల పంపిణీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయనీ, జాప్యం లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గెలలు అక్రమ రవాణా నివారణ కు పటిష్ట చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ప్రయివేటు కంపెనీలతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఫ్యాక్టరీల్లో గెలల దిగు మతిపై ఎదురవుతున్న ఆలస్యాన్ని నియంత్రించేందుకు కొత్త ప్లాట్ ఫామ్‌లు, వే బ్రిడ్జిలు నిర్మిస్తున్నామనీ, రైతులకు కనీస సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విస్తరణకు అవసరమైన ఉద్యోగాల భర్తీ అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతు నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, తుమ్మా రాంబాబు, ఆళ్ళ నాగేశ్వరరావు, తదితరులు ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్‌కు ఆయిల్‌ఫెడ్ డివిజన్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎండీ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. సమావేశంలో జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి, డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు.