Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుముఖ ప్రాజెక్టులతో ఆర్అండ్బీ మున్ముందుకు
- ఆరు లేన్లుగా హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే
- త్వరలోనే పనులు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోడ్లు దేశం జీవనరేఖకు చిహ్నం. వేగంగా సాంఘీక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. రకరకాల రవాణా అవకాశాలు ఉండగా, 80శాతం సరుకులు, ప్రయాణికుల చేరవేత రోడ్ల ద్వారానే జరుగుతోంది. రోడ్లకు ఇంతటి ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నది. రాష్ట్ర, జాతీయ రహదారుల నిర్మాణానికి విస్త్రృతంగా పూనుకుంటున్నది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇప్పటికే సుదీర్ఘమైన కసరత్తు చేపట్టింది. కొన్ని ఇప్పటికే కార్యరూపం దాల్చగా, మరికొన్నింటిని త్వరలోనే ఉనికిలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ప్రధానంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. ఈ మేరకు ఇటీవల కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జాతీయ రహదారి 65ను విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.545 కోట్లను మంజూరు చేయించుకుంది. దీని నిర్మాణానికి ప్రణాళికల అమలు పనిలో ఆర్అండ్బీ తలమునకలై ఉంది.
ఆరు లేన్లుగా..
జాతీయ రహదారి 65 మహారాష్ట్రలోని పుణేలో ప్రారంభమై కర్నాటక, తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం వరకూ విస్తరించి వుంది. ఇందులో హైదరాబాద్ నుంచి విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగమైన ఎల్.బి నగర్-మల్కాపూర్ మార్గం విస్తరణకు పూర్తిస్థాయి నివేదిక(డీపీఆర్)ను తయారుచేసింది. ఈ మేరకు ఎన్హెచ్ఏ నుంచి అనుమతులు పొందింది. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఏర్పాటుచేస్తున్నది. దీనిని ఆరులేన్లుగా విస్తరించనున్నారు. అలాగే మరో ఆరు లేన్ల సర్వీసు రోడ్లనూ ఏర్పాటుచేస్తారు. తొమ్మిది ప్రాంతాల్లో అండర్‌పాస్ బ్రిడ్జిలను కట్టనున్నారు. హైదరాబాద్-విజయవాడ రహదారి ఇప్పటికే నాలుగు లేన్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎల్బి నగర్ నుంచి మల్కాపూర్ వరకు ఆరులేన్లుగా విస్తరణకు సన్నాహాలు చేస్తున్నది. దాదాపు 25 కిలోమీటర్ల మేర వెడల్పు చేయాల్సి ఉంది. సమస్యల్లేని ప్రయాణ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ రహదారి కొన్ని చోట్ల ఆరు లేన్లు ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎనిమిది, నాలుగు లేన్లుగా గతంలో నిర్మించారు. దీంతో అనేక ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. విస్తరణ సందర్భంగా ఏడు కిలోమీటర్ల మేర పెద్దసర్వీస్ రోడ్డును సైతం నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధంచేశారు.
ఇబ్బందులు..సమస్యలు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ప్రతిరోజూ లక్షలాది వాహనాలను చేరవేస్తున్నది. పండుగల సమయాల్లో ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణమవుతున్నాయి. ప్రత్యేకించి పండుగల సమయాల్లో ఈ తరహా ఇబ్బందులు మరీ అధికం. గంటల కొద్ది ట్రాఫిక్‌లోనే ఉండాల్సిన రావడంతో ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతున్నది. అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారికి అది అసాధ్యంగా పరిణమించింది. అంబులెన్స్‌లు ట్రాఫిక్ మధ్యలో చిక్కుకుపోయి ఒక్కోసారి మనుషుల ప్రాణాలే పోతుండటం బాధాకరం. రాష్ట్రంలో ఎన్‌హెచ్ 65 జహీరాబాద్‌లో ప్రారంభమై సంగారెడ్డి, హైదరాబాద్, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నక్రేకల్, సూర్యాపేట, మునగాల, కొదాడ మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరుతుంది. ఇదిలావుండగా హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ పక్కనుంచే ఎన్‌హెచ్ 65 పోతున్నది. అలాగే భారీ వర్షాలు కురిస్తే ఇక అంతే. నగరం సాంతం సాగరంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రయాణికులు ట్రాఫిక్ భారీన పడటంతోపాటు నాళాలలో పడి మురికి కాలువల్లో కొట్టుకుపోయే దయనీయస్థితి ఏర్పడింది. వెరసి ఈ రోడ్డు పూర్తిగా నరకకూపంగా తయారైంది. నగరంలో ట్రాఫిక్ నివారణకు ఇప్పటికే ఉప్పల్‌లో ఎలివేటేడ్ కారిడార్, బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ వే, మెహదీపట్నం నుంచి శంషాబాద్ వరకు పివి నర్సింహారావు ఎక్స్వేను నిర్మించిన విషయం విదితమే. తాజాగా హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ నిర్ణయంతో మరిన్ని ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టే అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాలనూ నివారించడానికి వీలవుతుందని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.