Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా రైతాంగంపై రూ.21 కోట్లు
- వ్యవసాయ యంత్రాలకు భారీగా పెరిగిన కిరాయి
- గతేడాదితో పొల్చితే రూ.200 నుంచి రూ.600 వరకు పెరుగుదల
- ఒక్కో ఎకరాకు రూ.1050 అదనపు భారం
- లబోదిబోమంటున్న రైతాంగం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగినందుకు సంతోషించాలో.. లేక ఆ యంత్రాలకు వినియోగించే చమురు ధరలు పెరుగుతున్నందుకు దు:ఖించాలో తెలియని అయోమయ స్థితిలో రైతులు చిక్కుకున్నారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రైతన్నపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దుక్కి నుంచి మొదలు పంట కోతల వరకు వినియోగించే యంత్రాలు చమురుతో అనుసంధానమవడంతో ఆ భారం అంతిమంగా రైతులపై పడుతోంది. పెట్టుబడి ఖర్చు మరింత భారమవుతోంది. రెండేండ్ల కింద వరికోత మిషన్ ధర గంటకు కిరాయి రూ.1600 ఉండగా.. ప్రస్తుతం రూ.2500-రూ.2600 వరకు పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.112కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.105 వరకు పెరిగింది. ఈ భారాలతో పంట పెట్టుబడి వ్యయం అమాంతం పెరుగుతోంది. కానీ గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు.
నిజామాబాద్ జిల్లాలో ఈ యేడాది 2,07,606 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరిసాగుకు ముందు పంటను దుక్కిదున్నడం, దమ్ముకొట్టడం చేయాల్సి ఉంటోంది. ట్రాక్టర్లతో దుక్కిదున్నినందుకు గంటకు కిరాయి వసూలు చేస్తారు. అయితే పెరుగుతున్న చమురు ధరల వల్ల ప్రతియేటా ఈ ధరలు పెరుగుతున్నాయి. రెండేండ్ల కిందట దుక్కిదున్నినందుకు రూ.500 నుంచి రూ.600 వసూలు చేయగా.. గతేడాది రూ.800కు పెంచారు. ఈ యేడాది ఏకంగా రూ.1000 వసూలు చేశారు. గతేడాదితో పొల్చితే ఎకరాకు రూ.200 అదనంగా రైతులకు ఖర్చు అయ్యింది. దమ్ము కొట్టేందుకు సైతం గంటకు రూ.200 పెంచారు. దుక్కిదున్నడం, దమ్ముకొట్టడం వరకు గతేడాదితో పొల్చితే రూ.400 రైతులు అదనంగా ఖర్చు చేశారు. వీటికితోడు వరికోత మిషన్ కిరాయి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు చూపి ప్రతియేటా వాహన యజమానులు రేట్లు పెంచేస్తున్నారు. పైగా డీజిల్ ఖర్చులు, డ్రైవర్ కూలీ, వాహనాల నిర్వహణ పోను తమకేమీ మిగలడం లేదని వాహనయజమానులు వాపోవడం గమనార్హం. ప్రతియేటా రేట్లు పెంచితే ఎలా అని రైతులు వాపోతున్నారు. పంట కోత మిషన్లకు గతేడాది గంటకు రూ.2000 ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.2500 నుంచి రూ.2600 వసూలు చేస్తున్నారు. ఒక ఐదు ఎకరాలు ఉన్న సాధారణ రైతు ఈ చమురు ధరలు పెరగడం వల్ల కేవలం పంట కోసిన దానికి గతేడాదితో పొల్చితే రూ.2000 అధికంగా భరించాల్సి వస్తోంది. ఇక పంట కోసిన తరువాత ధాన్యాన్ని పొలాల నుంచి కల్లాలకు లేదా రోడ్లపై తీసుకువచ్చేందుకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. చివరకు ఈ ధరలు కూడా పెంచారు. గతంలో ఓ రైతుకు ట్రిప్పుకు రూ.300 వసూలు చేస్తుండగా.. ఈ యేడాది రూ.450 పెంచారు. ఈ లెక్కన ప్రతిదాంట్లో రైతు భారం మోయాల్సి వస్తోంది.
సాధారణ రైతుపై ఎకరాకు రూ.వెయ్యి భారం
కేంద్రంలోని మోడీ సర్కారు చమురు ధరలను నియంత్రించకపోవడం, అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో తగ్గించకపోవడంతో అటు ప్రజలపై, ఇటు రైతులపై తీవ్ర భారమవుతోంది. వ్యవసాయ పనులకు పరిశీలిస్తే గతేడాది ఎకరాకు దుక్కి దున్నడం నుంచి పంట కోత వరకు రూ.3900 వరకు ఖర్చు చేశారు. కానీ ఈ యేడాది ఒక్కో ఎకరాకు రూ.4,950 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ విధంగా ఎకరాకు రూ.1050 అదనంగా ఖర్చు చేశారు. కానీ కేంద్ర సర్కారు మాత్రం మద్దతు ధరను కేవలం రూ.72 మాత్రమే పెంచింది. గతంలో ఏగ్రేడ్కు రూ.1888 ఉండగా.. ఈ యేడాది 1960కి పెంచింది. అయితే ఈ పెంచిన ధర రైతుకు ప్రయోజనం దక్కకుండా చమురు మింగేసింది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో వరి 2,07,606 ఎకరాల్లో సాగు చేశారు. ఒక్కో ఎకరాకు రూ.1050 చొప్పున.. జిల్లా రైతాంగంపై రూ.21 కోట్ల అదనపు చమురు భారం పడింది.