Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికల్లో మద్యం, నగదు ప్రవాహం
- హుజూరాబాద్ నియోజకవర్గానికి చేరిన తాయిలాల సరంజామా
- కుల సంఘాల వారీగా ఆయా పార్టీల అందజేత
- పోలీసులు పట్టుకున్నది రూ.కోటిన్నర పైనే..
- ఓటు మీట.. భవిష్యత్తుకు బాట పేరుతో అధికారుల అవగాహన
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఏ నియోజకవర్గ భవిష్యత్ అయినా అక్కడి ఓటర్ల పైనే ఆధారపడి ఉంటుంది. ఓటర్లు తమ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని ఎంత సద్వినియోగపరుచుకుంటే.. తమ భవిత అంత బాగా ఉంటుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అభ్యర్థుల గెలుపు ఓటర్ల చేతిలో ఉంది. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే అభ్యర్థిని ఎన్నుకునేలా అధికారులు ''ఓటు మీట.. భవిష్యత్తుకు బాట'' పేరుతో అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఆయా రాజకీయ పార్టీలు తమ తాయిలాల సరంజామాను ఎప్పుడో అక్కడకు చేర్చాయి. పోలీసులు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటివరకు రూ.కోటిన్నర పైనే పట్టుకోవడం ఇందుకు అద్దం పడుతోంది.
'ఓటు మీట.. భవిష్యత్‌కు బాట' అంటూ హుజూరాబాద్‌లో ఓటర్లందరూ ఆయా పోలింగ్ కేంద్రాలకు కదిలేలా జిల్లా అధికార యంత్రాంగం తగు చర్యలను తీసుకుంటోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఉప ఎనికలో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఓటు విలువను అందరికీ తెలియజేసేందుకు అధికారులు తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్నివర్గాల ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ హక్కును వినియోగించుకునేలా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు. 2018 ఎన్నికల్లో 84.40 శాతం పోలింగ్ కాగా.. ఈసారి దాదాపుగా 90శాతానికిపైగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా అవగాహన పెంచుతున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులను కల్పిస్తున్నారు. దివ్యాంగులతోపాటు వృద్ధులకు అవసరమైన సదుపాయాల్ని కల్పించేందుకు ఏర్పాట్లను చేపడుతున్నారు.
భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య
మూడేళ్లతో పోలిస్తే నియోజకవర్గంలో ఓటర్లసంఖ్య భారీగానే పెరిగింది. ఏకంగా 27,540 ఓట్లు పెరిగాయి. ఇటీవల ఎన్నికల అధికారులు అర్హులైన ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయా గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను ప్రజలు చూసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాయిలాల పర్వం..
హుజూరాబాద్ ఉప ఎన్నిక భారీ ఖర్చుతో కూడుకున్నదిగా అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతున్నది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు కుల, ప్రజా, మహిళా సంఘాల వారీగా మచ్చిక చేసుకొనేందుకు తాయిలాలు అందజేశాయి. ప్రధాన జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి కుట్టుమిషన్లు, గడియారాల పేరుతో తొలుత ఈ తాయిలాల పర్వానికి ఆద్యం పోశారు. అధికార విపక్ష పార్టీలు వర్గాల వారీగా ఆకట్టుకునే ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రలోభాల పర్వంలో భాగంగా నగదు, మద్యం ఆయా బాధ్యుల వరకు చేరినట్టు సమాచారం మరోవైపు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఉప ఎన్నిక ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. కోటిన్నరకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలపడం నగదు ప్రవాహానికి అద్దం పడుతోంది.